Munugodu: ఇంటింటికి చికెన్.. పెద్దలకు మద్యం.. పిల్లలకు క్రాకర్స్.. దీపావళి పండుగ అంతా మునుగోడులోనే..

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు, అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాలకు తెర లేపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపావళి పండుగ...

Munugodu: ఇంటింటికి చికెన్.. పెద్దలకు మద్యం.. పిల్లలకు క్రాకర్స్.. దీపావళి పండుగ అంతా మునుగోడులోనే..
Munugode Bypoll
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 24, 2022 | 6:34 PM

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు, అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాలకు తెర లేపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపావళి పండుగ కావడం, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఓటర్లను తమ వైపు లాక్కునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పండుగ సందర్భంగా ఇంటింటికీ చికెన్, మద్యంతో పాటు పిల్లలకు క్రాకర్స్, మహిళలకు చీరలు ఇస్తున్నాయి. ఓట్లు వేయించగలిగే నాయకులకూ భారీగా ఆఫర్లు అమలు చేస్తున్నాయి. ఈ పంపిణీని ఇప్పటికే ఓ ప్రధాన పార్టీ ప్రారంభించగా.. మిగతా పార్టీలూ పంచేందుకు సిద్ధమవుతున్నాయి. పిల్లలకు టపాకాయలు, పెద్దలకు మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. చికెన్‌ సెంటర్లలో పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చాయని నిర్వహకులు తెలిపారు. గ్రామాల్లో చికెన్‌ సెంటర్లు ఉంటే అక్కడే ఆర్డర్‌ ఇచ్చి పంపించేలా స్థానికంగా ఉండే పార్టీ అభిమానులకు చెప్పినట్లు సమాచారం.

గ్రామ, మండల స్థాయి నాయకులకు ప్రధాన పార్టీలు దీపావళి పండుగను పురస్కరించుకొని భారీ ఆఫర్లు ప్రకటించాయి. అంతే కాకుండా నగదునూ అందిస్తున్నాయి. ఓట్లు వేయించగలిగే సత్తాను బట్టి రూ.25 వేల నుంచి రూ.2లక్షలు వరకు ఇస్తున్నారు. మరో ప్రధాన పార్టీ వారూ రూ.10వేలు నుంచి రూ.లక్షన్నర వరకు ముట్టజెప్పుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల పుణ్యమా అని నియోజకవర్గంలో పండుగ అంతా పార్టీల విందులతోనే గడిచిపోతోంది.

కొన్ని రోజులుగా నియోకవర్గంలో పగటి పూట ప్రచారం, రాత్రి వేళల్లో మద్యం సిట్టింగ్ వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా పావళి సందర్భంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మునుగోడు, మర్రిగూడ మండలాల్లో చీరల పంపిణీని ప్రారంభించారు. మరో పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చీరలు పంచకుండా డబ్బులు పంచుతున్నట్లు తెలిసింది. చూడాలి మరి.. ఇన్ని చిత్రాల మధ్య జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్ దేవుళ్లు ఎవరిని ఆశీర్వదిస్తారో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..