ఉత్కంఠకు తెర.. కాళేశ్వరంపై కేసీఆర్ విచారణ పూర్తి.. కేసీఆర్‌ను కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మార్పు, NDSA రిపోర్ట్, మేడిగడ్డ కుంగుబాటు, నిధుల ఖర్చుపై కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్ని్ంచింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు బీఆర్‌ఎస్ అధినేత రావడం ఒక్కరోజు హడావుడి కాదిది. గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి ఇదే చర్చ.. ఇదే రచ్చ..! ఆయనొస్తారా? రారా..? వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఇదే దుమారం నడుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ.. ఎట్టకేలకే కమిషన్ ముందుకొచ్చారు కేసీఆర్.

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మార్పు, NDSA రిపోర్ట్, మేడిగడ్డ కుంగుబాటు, నిధుల ఖర్చుపై కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్ని్ంచింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు బీఆర్‌ఎస్ అధినేత రావడం ఒక్కరోజు హడావుడి కాదిది. గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి ఇదే చర్చ.. ఇదే రచ్చ..! ఆయనొస్తారా? రారా..? వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఇదే దుమారం నడుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ.. ఎట్టకేలకే కమిషన్ ముందుకొచ్చారు కేసీఆర్.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాత.. తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడిన ఉత్కంఠకు ప్రస్తుతానికి ఇలా తెరపడింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విచారించడంతో.. కాళేశ్వరం విచారణ తుదిఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ఎర్రవల్లిలో కేసీఆర్ కాన్వాయ్ ప్రారంభమైంది మొదలు.. బీఆర్‌కే భవన్‌కు చేరుకునే వరకు.. ఆ తర్వాత ఆయన విచారణను ముగించుకుని వెళ్లిపోయేవరకు.. ప్రతీ సీన్ ఆద్యంతం రసవత్తరం అనిపించింది. బుధవారం(జూన్ 11) ఉదయం 11గంటలకు బీఆర్కే భవన్ చేరుకున్న కేసీఆర్‌కు చేరుకోగా.. అప్పటికే భారీస్థాయిలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అలెర్టయిన పోలీసులు ఆ చుట్టుపక్కల 200మీటర్ల వరకు ఎవరినీ రానీయకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కేసీఆర్ విచారణ జరుగుతున్నంత సేపు.. ఆ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మొదట బహిరంగ విచారణ జరుగుతుందని భావించినా.. కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించి, 12గంటలకు వన్ టు వన్ విచారణ ప్రారంభించారు జస్టిస్ ఘోష్. యాభై నిమిషాల పాటు కేసీఆర్‌కు కీలక ప్రశ్నలు సంధించారు. 12.55కు బయటకు వచ్చిన కేసీఆర్.. కారులోంచే కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు. అయితే, కాళేశ్వరంపై కేసీఆర్ నుంచి జస్టిస్ ఘోష్ కమిషన్ కీలక సమాచారం తీసుకుంది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ అడిగినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి రీ ఇంజనీరింగ్‌పై కమిషన్‌కు కేసీఆర్ వివరించినట్టు సమాచారం.
ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నించగా.. కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని కమిషన్‌కు తెలిపిన కేసీఆర్.. చివరగా ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్రసమాచారంతో కూడిన పుస్తకాన్ని కమిషన్‌కు అందించారు. కేసీఆర్‌తోపాటు లోపలికి 9 మందికి అనుమతించగా.. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు, విచారణ సందర్భంగా అధినేతతో ఉన్నారు.
బ్యారేజీల్లో ఎంత నీరు నిల్వ చేయాలని ఆదేశాలు ఇచ్చారా అని అడిగిన కమిషన్ ప్రశ్నకు సమాధానంగా, బ్యారేజీల్లో నీటి నిల్వపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. నీటిని మళ్లించేందుకు ఎంత నిల్వ చేయాలన్నది సాంకేతిక బృందం చూసుకుంటుందన్న కేసీఆర్, నీటి నీల్వ అనేది రాజకీయ పరమైన నిర్ణయం కాదని కేసీఆర్ అన్నారు. కరోనా, ఇతర కారణాల వల్ల కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఆదాయం రాలేదని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినందున ఆ మెుత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందన్నారు. మూడు చోట్ల ఆనకట్టలు కట్టాలని వ్యాప్కోస్ సిఫారసు చేసిందని కేసీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని కేసీఆర్ వివరించారు. ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. ఒక ఈఈ అక్కడ అందుబాటులో ఉండేలా చూశామన్నారు. ప్రాజెక్ట్ ఆపరేషన్, నిర్వహణ కోసం రూ.280 కోట్లు కేటాయించామని మాజీ సీఎం పేర్కొన్నట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పీసీ ఘోష్ కమిషన్, మొత్తం 18 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం చేపట్టినట్లు, బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశం అని కేసీఆర్ అన్నారు. మళ్లించాల్సిన నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కేసీఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కొత్త రాష్ట్రంలో నిధుల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వేగంగా పూర్తి చేసేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలిచారు. గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు హాజరైన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్.. మల్లెల బాజ్జీపై హత్యాయత్నం కేసులో విచారణను ఎదుర్కొన్నారు.
మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణలో చివరి ఘట్టం ముగిసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 114 మందిని విచారించిన కమిషన్, 115వ వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించింది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌ను విచారించిన కమిషన్, కేసీఆర్‌ను కూడా విచారించడంతో.. జస్టిస్ ఘోష్ కమిషన్ టాస్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. జులై నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో.. ఇక కమిషన్ కమిషన్ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..