Telangana: నేటితో ముగుస్తున్న వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
తెలంగాణ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు నేటితో (మే 31) ముగుస్తున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ ప్రథమ..

తెలంగాణ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు నేటితో (మే 31) ముగుస్తున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు జూన్ 30 నాటికి పూర్తవుతాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) విడుదల చేసిన అకడమిక షెడ్యూల్ ప్రకారం.. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి 304 రోజులలో అన్ని జూనియర్ కాలేజీలకు 227 పని దినాలు ఉంటాయి.
మరోవైపు రాష్ట్రంలోని 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 301.24 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. అలాగే 212 జూనియర్ కాలేజీల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లను నిర్మిస్తోంది. అలాగే కొత్తగా ఎనిమిది కొత్త భవనాలను నిర్మించనున్నారు. 122 జూనియర్ కాలేజీలకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం, 48 కాలేజీల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన కాలేజీలకు కంప్యూటర్ ల్యాబ్‌లు, ల్యాబ్ పరికరాలు, మెటీరియల్‌ను సప్లై చేయాలని ప్రతిపాదించారు. రూ.29.99 కోట్ల వ్యయంతో 331 మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు.
ఈ 2023-24 విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంట్ సిటీ కాలేజ్ (అటానమస్)లో మూడు కొత్త అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. కంప్యూటర్ సైన్స్‌లో నాలుగేళ్ల BSc (ఆనర్స్), బయోటెక్నాలజీలో BSc (ఆనర్స్), టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల BBA కోర్సలను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ప్రవేశాలు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.




మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.