అయ్యో దేవుడా..! పదేళ్లకు వచ్చిన తండ్రి.. వాటర్ క్యాన్ తీసుకొస్తానని వెళ్లిన కొడుకు.. పాపం అంతలోనే..
ఆ తండ్రి బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. కుటుంబంతో ఆనందంగా గడుపుదామని తిరిగొచ్చాడు. కానీ.. ఆ ఆనందం.. ఒక్కరోజు కూడా లేకుండా పోయింది. పదేళ్ల తర్వాత ఇంటికొచ్చిన ఆ తండ్రిని విషాదం వెంటాడింది.
ఆ తండ్రి బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. కుటుంబంతో ఆనందంగా గడుపుదామని తిరిగొచ్చాడు. కానీ.. ఆ ఆనందం.. ఒక్కరోజు కూడా లేకుండా పోయింది. పదేళ్ల తర్వాత ఇంటికొచ్చిన ఆ తండ్రిని విషాదం వెంటాడింది. తండ్రి గల్ఫ్ నుంచి వచ్చినరోజే కన్నకొడుకు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మిపూర్ చెందిన చౌటపల్లి శివకార్తీక్ అనే బాలుడు రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. ఇంటి పనులు చేసే క్రమంలో మినిరల్ వాటర్ క్యాన్ తెచ్చేందుకు స్కూటీపై బయటకు వెళ్లాడు శివకార్తీక్. అయితే.. అనుకోని పరిస్థితుల్లో స్కూటీ.. డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలై.. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. కన్నకొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
10 ఏళ్ల తర్వాత కుటుంబంతో ఆనందంగా గడుపుదామని.. తండ్రి తిరిగి వచ్చిన వేళ.. ఒక్కగానొక్క కొడుకును మృత్యువు గద్దలా తన్నుకుపోయింది. మినరల్ వాటర్ తీసుకొస్తాను.. నాన్నా అని ఉత్సాహంగా చెప్పి వెళ్లిన కొడుకు.. శాశ్వతంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు.
మంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన కొడుకు శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదించిన తీరు అక్కడివారిని కంట తడి పెట్టించింది. కన్న కొడుకుతో ఆ తండ్రి ఒక్క పూట కూడా గడపకుండానే రోడ్డు ప్రమాదం రూపంలో కొడుకు మృతిచెందాడు. ఈ హృదయవిధారక ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..