మీ జీతం రూ.25 వేలా? అయితే ఇలా చేయండి.. ధనవంతులవుతారు!
నెలకు రూ.25,000 జీతం పొందే వారు ఆర్థికంగా స్థిరపడటానికి క్రమబద్ధమైన బడ్జెట్ అవసరం. నిపుణుల సలహా ప్రకారం, అవసర ఖర్చులకు 50-55 శాతం, జీవనశైలి ఖర్చులకు 20-25 శాతం కేటాయించాలి. ముఖ్యంగా, కనీసం 20 శాతం పొదుపు, పెట్టుబడులకు మళ్లించడం ద్వారా భవిష్యత్తుకు ఆర్థిక భద్రత పొందవచ్చు.

నెలకు రూ.25 వేల జీతం పొందే ఉద్యోగులు ఆర్థికంగా స్థిరపడాలంటే ముందుగా క్రమబద్ధమైన బడ్జెట్‌ను రూపొందించుకోవడం అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ జీతంతోనూ సరైన ప్రణాళిక ఉంటే ఖర్చులు నియంత్రణలో ఉండటమే కాకుండా పొదుపు కూడా సాధ్యమని వారు చెబుతున్నారు. నిపుణుల సూచనల ప్రకారం.. రూ.25 వేల జీతంలో మొదటగా అవసర ఖర్చులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇల్లు అద్దె, విద్యుత్, ప్రయాణం, కిరాణా వంటి తప్పనిసరి ఖర్చులకు సుమారు 50 నుంచి 55 శాతం వరకు కేటాయించడం మంచిదని భావిస్తున్నారు. అంటే నెలకు దాదాపు రూ.13 వేల వరకు ఈ విభాగానికి వినియోగించవచ్చు. ఖర్చులు ఈ పరిమితిని మించకుండా చూసుకోవడం కీలకం.
ఇతర జీవనశైలి ఖర్చులు మొబైల్ రీచార్జ్, చిన్నపాటి వినోదం, బయట భోజనం వంటి వాటికి సుమారు 20 నుంచి 25 శాతం వరకు మాత్రమే ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది దాదాపు రూ.5 వేల పరిధిలో ఉండేలా నియంత్రించాలి. అనవసర ఆన్‌లైన్ షాపింగ్, ఆకస్మిక ఖర్చులను తగ్గించడం ద్వారా ఈ భాగాన్ని సులభంగా నియంత్రించవచ్చు. ముఖ్యంగా పొదుపు, పెట్టుబడులకు కనీసం 20 శాతం కేటాయించడం అత్యంత అవసరం. రూ.25 వేల జీతంలో కనీసం రూ.5 వేల మొత్తాన్ని నెలకు పక్కన పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనిని రికరింగ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్ SIP లేదా అత్యవసర నిధిగా దాచుకోవడం భవిష్యత్తుకు భద్రత కల్పిస్తుంది.
ఆర్థికంగా ఎదగాలంటే ఆదాయం పెరిగే వరకు వేచి చూడకుండా, ఉన్న జీతంతోనే క్రమశిక్షణతో బడ్జెట్‌ను పాటించడం ముఖ్యం. చిన్న మొత్తాలతో మొదలైన పొదుపే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భరోసాగా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
