Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట.. సీఎం కేసీఆర్ వ్యూహం అదేనా..?
Telangana Early Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా..? కేసీఆర్ అందుకు సిద్దంగా ఉన్నారా..? కేసీఆర్ సుడిగాలి పర్యటనలు, బిజెపిపై వార్, బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట. ఇవన్నీ ముందస్తు సంకేతాలా?
Telangana Early Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా..? కేసీఆర్ అందుకు సిద్దంగా ఉన్నారా..? కేసీఆర్ సుడిగాలి పర్యటనలు, బిజెపిపై వార్, బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట. ఇవన్నీ ముందస్తు సంకేతాలా? కేసీఆర్ ఎన్నికల వ్యూహంతోనే కదులుతున్నారా? విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా ఎన్నికల గోదాలోకి దిగాలని సీఎం కేసీఆర్ (CM KCR) భావిస్తున్నారా? పరిస్థితులు పరిణామాలు చూస్తోంటే ముందస్తు గంటలు స్పష్టంగా కొడుతున్నాయి. టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, విపక్షానికి చెందిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలు (Elections in Telangana) వస్తాయని ప్రకటించడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని ఇటీవల ఆసక్తికర ప్రకటన చేశారు. రానున్న ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టిఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు చూసిన ప్రతిఒక్కరికి ఎమ్మెల్యే నోరు జారారా..? లేక.. అధిష్ఠానం లోగుట్టును బయటపెట్టేశారా..? అని చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలో రూ.2.56లక్షల కోట్లతో 2022-23 బాహుబలి బడ్జెట్ పెట్టమే కాకుండా సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి జనరంజక బడ్జెట్‌కు తీర్చిదిద్దారు కేసీఆర్. ఈ బడ్జెట్ లోతుల్లోకి వెళితే ఖచ్చితంగా కేసీఆర్ ముందస్తు వ్యూహంతోనే ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అనూహ్య మెజారిటి సాధించారు. 2019లో సాధారణ ఎన్నికలు జరుగాల్సి ఉండగా ఒక ఏడాది ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2018 డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లాడు. ఆయన రచించిన వ్యూహంతో టిఆర్‌ఎస్ తిరుగులేని మెజారిటితో అధికారంలో వచ్చింది. మళ్లీ ఎన్నికలు 2023 డిసెంబర్‌లో జరగాలి. కానీ కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లితే ప్రతికూల ఫలితాలు చూడాల్సి వస్తోందని విశ్లేషిస్తున్న కేసీఆర్ ఈ ఏడాది డిసెంబర్‌లోనే అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలు వెళుతారని అంటున్నారు.
అందుకే బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసినట్లు టిఆర్‌ఎస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 57 ఏళ్లపైనున్న అందరికీ ఆసరా పింఛన్లు, సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు, ఇందు కోసం డబుల్ బెడ్రూమ్ ల కోసం రూ. 12,000 కోట్లు, దళితబంధు రూ.17,700 కోట్లు.మన ఊరు- మన బడి రూ.7,289 కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం రూ.12,565 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ. 1,394 కోట్లు, బిసి సంక్షేమం కోసం రూ.5,698కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు, పల్లె ప్రగతికి రూ. 3,330 కోట్లుకు కేటాయించారు. ఇదంతో చూస్తోంటే ముందస్తు ఎన్నికలు అనివార్యమంటున్నారు.
దీనికితోడు కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. బిజెపి నేతల విమర్శలను ఆరోపణలు ఏడాడు పెద్దగా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు బిజెపి అంటేనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బిజెపి నేతలను మోదీ నుంచి మొదలుకుని బండి సంజయ్ వరకు ఉతికి ఆరేస్తున్నారు. జిల్లాల పర్యటనలో వేగం పెంచారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సభలు పెట్టి తన పదునైన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో 2023లో ముందస్తు ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి.
Also Read: