AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దగ్గు వస్తుందని కరక్కాయ బుగ్గన పెట్టుకుని పడుకున్న మహిళ.. కట్ చేస్తే..

ఓ చిన్న కరక్కాయ ప్రాణాల మీదకు తెచ్చింది. రాత్రి పడుకున్నట్లు బాగా దగ్గు వస్తూ ఉండటంతో.. సదరు మహిళ పూర్వికుల చిట్కా పాటించి.. బుగ్గున కరక్కాయ పెట్టుకుని నిద్రించింది. అయితే నిద్రలో మింగేయడంతో.. అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుని తీవ్ర సమస్య వాటిల్లింది.

Hyderabad: దగ్గు వస్తుందని కరక్కాయ బుగ్గన పెట్టుకుని పడుకున్న మహిళ.. కట్ చేస్తే..
Myrobalan
Ram Naramaneni
|

Updated on: Sep 04, 2025 | 8:43 PM

Share

దగ్గు వస్తోందని రాత్రి నిద్రపోయేటప్పుడు కరక్కాయ బుగ్గన పెట్టుకోవడం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. హైదరాబాద్ నగరానికి చెందిన 57 ఏళ్ల విజేత అనే మహిళకు దగ్గు బాగా ఎక్కువగా వస్తుందని రాత్రి నిద్రకు దగ్గుతో ఇబ్బంది అవుతుందని, ఆమె కరక్కాయ బుగ్గన పెట్టుకుని పడుకున్నారు. నిద్రలో తెలియకుండానే దాన్ని మింగేశారు. అది కాస్తా శ్వాసనాళాల్లోకి వెళ్లిపోవడంతో ఆమెకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ రవీందర్ రెడ్డి, డాక్టర్ భరత్ జానపాటి తెలియచేసారు.

విజేత అనే ఈ మహిళకు కొంతకాలంగా వాతావరణంలో మార్పుల కారణంగా దగ్గు వస్తోంది. కూర్చున్నప్పటి కంటే పడుకుని ఉండే స్థితిలో దగ్గు ఎక్కువ అవుతుంది. రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుందని, దగ్గు తగ్గడానికి ఆమె ఒక కరక్కాయ బుగ్గన పెట్టుకున్నారు. నిద్రలో పొరపాటున దాన్ని మింగేశారు. దాంతో ఆమెకు విపరీతమైన దగ్గు, ఆయాసం, ఊపిరి అందకపోవడంతో బాధపడుతూ కామినేని ఆస్పత్రి ఎమర్జెన్సీ కు వచ్చారు. అక్కడ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాII రవీందర్ రెడ్డి గారు చూసి, శ్వాస ఆడటం లో ఎక్కువగా ఇబ్బంది ఉంటడంతో ఆమెను వెంటిలేటర్ మీద ఉంచి, ఐసీయూ లో అడ్మిట్ చేశారు. ఆమెకు చెస్ట్ ఎక్స్-రే, హెచ్ఆర్ సీటీ స్కాన్ పరీక్షలు చేయగా ఎడమ శ్వాసనాళాలలో ఎదో అడ్డు పడినట్టు, దాని కారణంగా ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా మూసుకుపోయినట్టు గుర్తించారు. వెంటిలేటర్ పైన ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడ్డాక కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాII భరత్ జానపాటి బ్రాంకోస్కోపీ ద్వారా శ్వాసనాళాలను పరీక్షించారు. ఎడమ శ్వాసనాళం ఒక పదార్థంతో మూసుకుపోయినట్టు గుర్తించారు. దాంతో ఆమెకు ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ చికిత్స చేయాలని నిర్ణయించారు. ఇదివరకే ఆమెకు అధిక రక్తపోటు, థైరాయిడ్, గుండె సమస్య ఉన్నాయి. గతంలో ఒకసారి యాంజియోప్లాస్టీ కూడా చేశారు. అందువల్ల ఈ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. అనస్తీషియా టీం సహకారంతో ఆపరేషన్ థియేటర్లో ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. బ్రాంకోస్కోపీ ద్వారా రాట్ టూత్ (Rat Tooth ) ఫోర్సెప్స్ అనే ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఎడమ శ్వాసనాళంలో రెండు ముక్కలుగా బలంగా ఇరుక్కుపోయిన కరక్కాయను పేషెంట్ కు ఎటువంటి హాని కలగకుండా విజయవంతంగా తీశారు.

బ్రాంకోస్కోపీ చేసిన తర్వాత తీసిన ఎక్స్-రేలో ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా తెరుచుకున్నాయి. రోగి పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది. ఎడమ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తోందని నిర్ధారించుకున్న మరుసటి రోజు ఆమెను డిశ్చార్జ్ చేసారు.

ఈ సందర్బంగా డాII భరత్ జానపాటి మాట్లాడుతూ “ఈ రకంగా శ్వాసనాళాలోకి, ఉపిరితిత్తులలోకి బయట పదార్థాలు వెళ్లడం ముఖ్యంగా చిన్నపిల్లల్లో, లేదా న్యూరోలాజికల్ సమస్యలు ఉన్న వారిలో తరచూగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా పడుకునే సమయాల్లో కరక్కాయలు, లేదా వక్క పలుకులు లాంటివి బుగ్గన పెట్టుకొని పడుకునే అలవాటు ఉన్నవారికి ఇలాంటి ప్రమాదాల బారిన పడే అవకాశాలు‌ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బ్రాంకోస్కోపీ ప్రక్రియ ద్వారా వాటిని తొలగించటం సాధ్యం” అని ఆయన తెలియచేసారు.