Hyderabad: ఛీ యాక్..! పంది కొవ్వుతో గుట్టుగా వంట నూనె తయారీ.. ఫ్రైడ్ రైస్ దుకాణాలకు విక్రయం..
పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోన్న కేటుగాడ్ని మాల్కాజగిరి పోలీసులు బుధవారం (జూన్ 28) అరెస్ట్ చేశారు. మల్కాజగిరి ఇన్‌స్పెక్టర్..
హైదరాబాద్: పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోన్న కేటుగాడ్ని మాల్కాజగిరి పోలీసులు బుధవారం (జూన్ 28) అరెస్ట్ చేశారు. మల్కాజగిరి ఇన్‌స్పెక్టర్ రాములు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ నేరేడ్‌మెట్ పరిధిలోని ఆర్కేపురంలో రమేశ్ శివ (24) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా రమేశ్ తన నివాసంలోనే గత కొన్నేళ్లుగా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు సేకరించే వాడు. అనంతరం దాన్ని వేడి చేసి పలు రకాల రసాయనాలు కలిపితే అచ్చం వంట నూనెలా కనిపించే నూనెలు తయారు చేస్తున్నాడు. ఇలా తయారు చేసిన నూనెను రోడ్డు పక్కన ఉండే ఫ్రైడ్ రైస్ దుకాణాల నిర్వాహకులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు.
పక్కా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రమేశ్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దీంతో గుట్టుగా పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్న నిందితుడి బండారం బట్టబయలైంది. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు. పంది కొవ్వు నూనెను కొనుగోలు చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ దుకాణదారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.