Telangana: మూగబోయిన ఉద్యమ గానం.. గుండెపోటుతో సాయిచంద్ హఠాన్మరణం..

తెలంగాణ ఫోక్ సింగర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. అర్థరాత్రి గుండెపోటు రాగా.. ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

Telangana: మూగబోయిన ఉద్యమ గానం.. గుండెపోటుతో సాయిచంద్ హఠాన్మరణం..
Sai Chand
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2023 | 7:07 AM

తెలంగాణ ఫోక్‌ సింగర్‌, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌ గుండెపోటుతో అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. నిన్న సాయంత్రం కుటుంబంతో కలిసి కారుకొండలో తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అక్కడే గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన నాగర్‌కర్నూల్‌ గాయత్రి ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సాయిచంద్‌ చనిపోయినట్లు కేర్‌ వైద్యులు ప్రకటించారు.

ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఆ పాట కోట్ల మందిని కదిలించింది. జానపదాన్ని నింపుకుని జనం గొంతుకై నిలిచిన పాట ఊరూవాడా ప్రతిధ్వనించింది. సొంతంగా రాసి.. బాణీకట్టి.. గజ్జెకట్టి ఆడుతుంటే యావత్‌ తెలంగాణ ఉద్వేగంతో ఊగిపోయింది. ఉద్యమ సమయంలో కీలక పోషించిన కళాకారులు చాలా మందే ఉన్నా.. సాయిచంద్‌ తీరు చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. అందుకే ఆయన మరణవార్త తెలంగాణ సమాజాన్ని కలిచివేస్తోంది. కళాకారుల హృదయాలన్నీ బరువెక్కిపోయాయి. గులాబీ పార్టీతో సాయిచంద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే.. ఆయన మరణ వార్త తెలియగానే పార్టీ ముఖ్యనేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చి నివాళులు అర్పించారు.

విద్యార్ధి దశ నుంచే ఉద్యమంలో భాగం అయ్యారు సాయిచంద్‌. ప్రత్యేక రాష్ట్రం కల సాకారం చేసుకునేందుకు తన వంతుగా గళమెత్తి ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. ఉద్యమ సమయంలో ఎక్కడ సభలు నిర్వహించినా.. సాయిచంద్ పాట మార్మోగేది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అభివృద్ధిని గుర్తు చేస్తూ పాడిన పాటలూ అంతే ప్రాచుర్యం పొందాయి. అగ్నిగుండమై మండిన నేల.. ఆకుపచ్చగా మారిందని అనుకున్నామా అంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని వివరిస్తూ ఆయన ఆలపించిన పాటలు ప్రత్యేకంగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ప్రతి కార్యక్రమంలో, ప్రతి సభలో వినిపించే సాయిచంద్ పాట.. ఇక గతమే అని తెలియడంతో తెలంగాణ కళాకారులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇక సింగర్‌ సాయిచంద్‌ మృతితో గచ్చిబౌళి కేర్‌ హాస్పిటల్‌కు బీఆర్ఎస్‌ ముఖ్యనేతలు చేరుకుంటున్నారు. మంత్రి హరీష్ రావు, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా ఇతర ప్రముఖ నేతలు ఇప్పటికే హాస్పిటల్‌కు చేరుకున్నారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి భౌతికకాయం తరలించాలని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..