AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

పిల్లాడిని ఇరవై ఒక్క ఏళ్ల వయసు వరకు పెంచి పెద్ద చేయడానికి ఏకంగా రూ.1.83 కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలు దేశవ్యాప్తంగా దంపతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ భారీ వ్యయాన్ని తట్టుకోలేక చాలామంది యువ దంపతులు పిల్లలను కనే ఆలోచనను పూర్తిగా పక్కన పెడుతున్నారు.

Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..
Children
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 1:44 PM

Share

గతంలో పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన డింక్ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్ విధానానికి ఆకర్షితులవుతున్న దంపతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాతావరణ కాలుష్యం, ఉరుకులు పరుగుల జీవితం, ఆర్థిక అస్థిరత వంటి కారణాలతో యువత తల్లిదండ్రులుగా మారడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. పిల్లల పెంపకంలో అత్యధికంగా విద్యకే సగానికి పైగా ఖర్చవుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం వ్యయంలో సుమారు యాభై తొమ్మిది శాతం కేవలం చదువులకే వెచ్చించాల్సి వస్తుండటం దంపతులను భయపెడుతోంది. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల భారం తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

విద్యాభ్యాసంతో పాటు పిల్లల నివాసం కోసం పది శాతం, వినోదానికి తొమ్మిది శాతం, దుస్తులకు ఆరు శాతం చొప్పున తల్లిదండ్రులు వెచ్చించాల్సి వస్తోంది. పిల్లల ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపాలంటే రిటైర్మెంట్ కోసం దాచుకున్న మొత్తంలో అరవై నాలుగు శాతం ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. కరోనా లాంటి విపత్కర సమయాల్లో ఉద్యోగాలు పోయిన అనుభవాలు కూడా యువత నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగాలు చేస్తూ పిల్లలను పెంచడం ప్రస్తుతం కత్తిమీద సాములా మారుతోందని అనేక మంది బలంగా విశ్వసిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల మద్దతు లేకుండా కేవలం భార్యాభర్తలు మాత్రమే పిల్లల బాధ్యతలు మోయడం మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడిని పెంచుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత ఇష్టాలను వదులుకుని రాజీ పడటం నేటి తరానికి ఏమాత్రం ఇష్టం ఉండటం లేదు.

పిల్లలకు బదులుగా పెంపుడు జంతువులను పెంచుకోవడానికే ఆధునిక దంపతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కుక్కలు లేదా పిల్లులను పెంచడానికి అయ్యే ఖర్చు ఒక పరిమితిలో ఉంటుందని, పిల్లలకైతే జీవితకాలం ఖర్చుల భారం మోయాల్సి వస్తుందన్నది వారి ప్రధాన వాదన. పెంపుడు జంతువుల వల్ల తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం కలగదని, అదే సమయంలో తోడు దొరుకుతుందని వీరు భావిస్తున్నారు. సొంత కలలు నెరవేర్చుకోవడం, ఆర్థిక స్వాతంత్ర్యం అనుభవించడం, ప్రపంచాన్ని చుట్టిరావడం లాంటి లక్ష్యాలకే నేటి యువత పెద్దపీట వేస్తున్నారు. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థకు భిన్నంగా ఆలోచిస్తూ ఎవరికీ జవాబుదారీ కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటున్నారు. ఆర్థిక లెక్కలతో ముడిపడిన ఈ కొత్త ట్రెండ్ రాబోయే రోజుల్లో భారతీయ కుటుంబ వ్యవస్థలో పెను మార్పులకు దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..

Follow Us