Hyderabad: బక్రీద్ పండుగ.. జోరుగా గొర్రెల, మేకల అమ్మకాలు.. అలాంటి వారితో జాగ్రత్త..
బక్రీద్ పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గొర్రెలు, మేకల సంతల్లో భారీ రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు ఫేక్ ఫోన్‌పే యాప్‌లతో వ్యాపారులను మోసం చేస్తున్నారు. నగదు పంపినట్లుగా నకిలీ స్క్రీన్ చూపించి జీవాలను తీసుకెళ్తున్నారు. కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు.

Hyderabad CP Sajjanar warning: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ నగరం, అలాగే పరిసర ప్రాంతాల్లో గొర్రెలు, మేకల సంతలు కొనుగోలుదారుల రద్దీతో సందడిగా మారాయి. అయితే, ఇదే అదనుగా భావిస్తున్న కొందరు కేటుగాళ్లు డిజిటల్ చెల్లింపుల పేరిట అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ ఫోన్ పే వంటి నకిలీ మొబైల్ అప్లికేషన్లను సృష్టించి, నగదు చెల్లించినట్లుగా స్క్రీన్‌పై చూపిస్తూ వ్యాపారులను నమ్మిస్తున్నారు. సంతల్లో ఉండే విపరీతమైన హడావుడిని ఆసరాగా చేసుకుని, తమ బ్యాంక్ ఖాతాల్లోకి నిజంగానే నగదు జమ అయ్యిందో లేదో సరిచూసుకోని వ్యాపారులకు ఈ కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. ఈ క్రమంలో గొర్రెల, మేకల అమ్మకందారులూ జాగ్రత్తగా ఉండాలంటూ ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ పరిధిలో కేటుగాళ్లు ఎలా మోసం చేశారో ఇందులో వివరించారు.
తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి రెండు మోసాలు వెలుగులోకి వచ్చాయి. కంచన్‌బాగ్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు మూడు బైక్‌లపై వచ్చి, ఒక వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ. 68 వేలు చెల్లించినట్లు నకిలీ యాప్ ద్వారా స్క్రీన్ చూపించి జీవాలను తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా రాజేంద్రనగర్‌లోనూ నలుగురు వ్యక్తులు రూ. 48 వేల విలువైన గొర్రెలను కొనుగోలు చేసి, ఇదే తరహాలో నకిలీ పేమెంట్ యాప్‌తో మోసగించారు. బాధితులు ఆలస్యంగా తమ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసుకోగా, పైసలు జమ కాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో గొర్రెలు, మేకల విక్రయదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా నగదు పంపినప్పుడు, కేవలం కొనుగోలుదారుడి ఫోన్‌లో కనిపించే స్క్రీన్ షాట్‌ను లేదా పేమెంట్ సక్సెస్ అనే మెసేజ్‌ను చూసి నమ్మవద్దు. మీ స్వంత మొబైల్‌కు వచ్చే బ్యాంక్ అధికారిక ఎస్‌ఎమ్ఎస్ చూసుకోండి లేదా నేరుగా మీ బ్యాంకింగ్ యాప్ తెరిచి బ్యాలెన్స్ పెరిగిందో లేదో స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే జీవాలను అప్పగించండి. వీలైనంత వరకు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు నగదు రూపంలో తీసుకోవడమే ఉత్తమం..
ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 100 కు కాల్ చేయండి లేదా మా పోలీసు అధికారులకు సమాచారం అందించండి.. అంటూ సీపీ సజ్జనార్ సూచించారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
