AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్రమ ఇసుక ట్రాక్టర్ సీజ్ చేస్తుండగా ఘోరం.. ఆర్టీఏ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన వ్యాన్!

రవాణా శాఖ అధికారుల విధి నిర్వహణలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసి తరలిస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీఏ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా రవాణా శాఖ అధికారికి జరిగిన ప్రమాద ఘటన మరువకముందే ఖమ్మంలో మరో ఘటన జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అక్రమ ఇసుక ట్రాక్టర్ సీజ్ చేస్తుండగా ఘోరం.. ఆర్టీఏ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన వ్యాన్!
Horrific Accident In Khammam
Balaraju Goud
|

Updated on: Jul 14, 2026 | 5:04 PM

Share

రవాణా శాఖ అధికారుల విధి నిర్వహణలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసి తరలిస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీఏ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా రవాణా శాఖ అధికారికి జరిగిన ప్రమాద ఘటన మరువకముందే ఖమ్మంలో మరో ఘటన జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం నగరం ప్రకాశ్‌నగర్ ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ అధికారి జేఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ట్రాక్టర్‌ను తరలిస్తున్న సమయంలో ఆర్టీఏ కానిస్టేబుల్ అశోక్ ట్రాక్టర్‌పై విధులు నిర్వహిస్తున్నారు.

అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ వ్యాన్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ ట్రాక్టర్‌పై నుంచి కిందపడగా, అదుపు తప్పిన వ్యాన్ ఆయనపై నుంచి వెళ్లింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహచర అధికారులు, స్థానికులు స్పందించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో అక్రమ రవాణాపై చర్యలు చేపడుతున్న అధికారుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తగిన భద్రతా చర్యలు, ఎస్కార్ట్ వాహనాలు కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవలి కాలంలో రవాణా శాఖ అధికారులపై జరుగుతున్న ప్రమాదాలు, దాడుల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది భద్రతను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us