ఆదివారం ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయా..? వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి తోడు రుతుపవన ద్రోణి, ఈదురుగాలులు తోడవ్వడంతో రాగల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నైరుతి బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని అనుబంధ ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ – యానాం వాతావరణ వివరాలు
తక్కువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం
శనివారం అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. ఆది, సోమవారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయి. బలమైన గాలులు కొనసాగుతాయి.
దక్షిణ కోస్తాంధ్ర
శనివారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు వచ్చి, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. ఆది, సోమవారాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ
ఇక రాయలసీమ వ్యాప్తంగా వచ్చే రెండు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.
తెలంగాణలో ఇలా
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రుతుపవన ద్రోణి ప్రస్తుతం అనూప్‌గఢ్, ఢిల్లీ, దిగ్ఘా మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు-మధ్య బంగాళాఖాతం వైపు కొనసాగుతోంది. వచ్చే మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాష్ట్రానికి ఎలాంటి భారీ వర్ష హెచ్చరికలు లేవని, సాధారణ మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. వాతావరణంలో మార్పుల దృష్ట్యా, వర్షాలు కురిసే సమయంలో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
