AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోబోల కోసం వస్తోన్న ‘చాట్‌జీపీటీ’ లాంటి మలుపు! 2027లో సాంకేతిక విప్లవం?

రోబోటిక్స్ పరిశ్రమ తన సొంత "చాట్‌జీపీటీ క్షణం" కోసం ఎదురుచూస్తోంది.  2022లో ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ ద్వారా జనరేటివ్ ఏఐని పరిచయం చేసి, అద్భుత బిజినెస్ ఐడియాకు బీజం వేసింది. అయితే ఒక రోబోతో మనం సొంత భాషలో మాట్లాడితే , అది మన ఇంట్లో పనులన్నీ పూర్తి చేయడానికి మరో 8 ఏళ్ల సమయం పడుతుందనీ,  2027 నాటికి రోబోల మెదడులో వాటి ఆలోచనా శక్తిలో అభివృద్ధిని కొంత మేర చూస్తామని చైనాకు చెందిన 'స్పిరిట్ ఏఐ' సహ వ్యవస్థాపకుడు గావో యాంగ్ తెలిపారు.   

రోబోల కోసం వస్తోన్న 'చాట్‌జీపీటీ' లాంటి మలుపు! 2027లో సాంకేతిక విప్లవం?
Chatgpt Style Breakthrough In Robots By Next Year
Sharada V
|

Updated on: Sep 19, 2026 | 8:23 PM

Share

వచ్చే ఏడాది హ్యూమనాయిడ్ (మనిషి పోలికలున్న) రోబోలు మౌఖిక ఆదేశాల (verbal instructions) ద్వారా చాలా వరకు సాధారణ పనులను చేస్తాయనీ, అయితే, అవి ఇళ్లలో పూర్తిగా ఉపయోగకరంగా మారడానికి మాత్రం చాలా సమయం పడుతుందని , దాదాపు ఎనిమిదేళ్ల సమయం పట్టవచ్చనీ స్పిరిట్ ఏఐ సహ వ్యవస్థాపకుడు గావో యాంగ్  బీజింగ్‌లోని రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.  రోబోల తయారీలో అతి ముఖ్యమైన మెదడు (సాఫ్ట్‌వేర్) తయారీ అత్యంత సంక్లిష్టమనీ అన్నారు. చైనాకు చెందిన హ్యూమనాయిడ్ రోబోలు పరుగెత్తడం, డాన్స్ చేయడం, పిల్లిమొగ్గలు వేయడం ఇప్పటికే సాధించాయి.  రోబోటిక్ సంస్థలు ఇప్పుడు రోబోల మెదడుకి సంబంధించిన సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసి, వాటితో ఇంటి పనులు చేయించడంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ రంగాన్ని “ఎంబోడీడ్ ఏఐ” (Embodied AI) అని పిలుస్తారు.

రోబోలకు ఎలా పనులు చేయాలో నేర్పించడం కోసం, స్పిరిట్ ఏఐ కంపెనీ చైనా వ్యాప్తంగా దాదాపు వెయ్యి మందితో పనిచేయిస్తోంది. వీరు తమ ఇళ్లలో, ఫ్యాక్టరీలలో ప్రత్యేక పరికరాలు ధరించి సమాచారాన్ని సేకరిస్తారు. బీజింగ్‌ కార్యాలయంలోని డేటా ట్రైనింగ్ సెంటర్‌లో, సెన్సార్లు ధరించిన డజన్ల కొద్దీ యువకులు ఫ్రిజ్‌లు తెరవడం, సేఫ్‌లు అన్‌లాక్ చేయడం, కత్తులతో కూరగాయలు తరగడం వంటి పనులను చేస్తారు. ఇప్పటికే ఇంట్లోని సాధారణ వాతావరణంలో చిన్న చిన్న పనులు స్పిరిట్ ఏఐ రోబోలు విజయవంతంగా చేస్తున్నాయి.

” ఒకటి రెండేళ్లలో ఫ్యాక్టరీలు, పరిశ్రమలలో రోబోల వాడకం మొదలవుతుంది. రెండేళ్ల తర్వాత షాపులు, హోటళ్ల వంటి వ్యాపార కేంద్రాలలో రోబోలు చిన్న చిన్న పనులు చేయడం చూస్తాం. కానీ, మన ఇళ్లల్లో పనులు చేయడం మాత్రం కష్టం” అని  గావో తెలిపారు. “టెక్నాలజీ వేగంగా మారుతోంది. మొదట్లో మా కంపెనీ రోబోలు నీళ్లు పోయడం, బట్టలు మడవడం ఇలా ఏదో ఒక్క పని మాత్రమే చేసేవి. కానీ ఇప్పుడు అవి అటూ ఇటూ తిరుగుతూ, వరుసగా కష్టమైన పనులన్నీ చేసేస్తున్నాయి” అని గావో తెలిపారు.  “అయినప్పటికీ, సీసా మూత తిప్పి తీయడం లాంటి సున్నితమైన పనులు, అలాగే ఇంతకుముందు ఎప్పుడూ చూడని కొత్త పనులను చేయడంలో రోబోలకు కొన్ని ఇబ్బందులు ఇంకా ఉన్నాయని” ఆయన అన్నారు. కంప్యూటర్లో చేసే ప్రాక్టికల్ సిమ్యులేషన్ల కంటే, వాస్తవ ప్రపంచంలోని సమాచారంతోనే స్పిరిట్ ఏఐ తన రోబోట్లకు శిక్షణ ఇస్తోంది. ఖర్చు తగ్గించుకోవడానికి చాలా కంపెనీలు కంప్యూటర్ సిమ్యులేటర్లను వాడినా, కొన్ని పనులు నేర్చుకోవాలంటే మాత్రం రోబోలు నేరుగా వస్తువులను తాకి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే అని గావో తెలిపారు.

ఇటీవల హ్యాకింగ్ ఘటనల వల్ల ప్రమాదాలు పెరుగుతుండటంతో, అడ్వాన్స్‌డ్ ఏఐ మోడళ్ల అభివృద్ధిని కొద్దిగా తగ్గించాలని అమెరికాలోని ఏఐ కంపెనీలు కోరాయి. కానీ రోబోలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నందున, అవి చేయి దాటిపోయి ప్రమాదకరంగా మారుతాయనే భయం ప్రస్తుతానికి లేదని గావో స్పష్టం చేశారు. అయినప్పటికీ, భవిష్యత్తులో రోబోట్లు షాపుల్లో, ఇళ్లలో రద్దీగా ఉండే ప్రదేశాలలో మనుషుల మధ్యే తిరుగుతాయి కాబట్టి, వాటి భద్రత విషయంలో  జాగ్రత్తలు తీసుకోవడం  ముఖ్యమని గావో అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us