AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియాద్‌పై హౌతీల డ్రోన్ దాడి..! విమానాశ్రయం వద్ద భారీ మంటలు.. దట్టమైన పొగ!

సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ విమానాశ్రయం వద్ద భారీ మంటలు చెలరేగాయి, దానికి యెమెన్‌లోని హౌతీల దాడి కారణమని రాయిటర్స్ నివేదించింది. ఇంధన నిల్వ ప్రాంతంలో మంటలు చెలరేగగా, నల్లటి పొగ ఆకాశాన్ని కమ్ముకుంది. ఈ సంఘటన హౌతీ-సౌదీ ఘర్షణను మళ్ళీ తీవ్రతరం చేసింది, ప్రాంతీయ భద్రత మరియు ప్రపంచ వాణిజ్య మార్గాలపై ఆందోళనలను పెంచింది. ఈ పరిణామాలు యెమెన్ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.

రియాద్‌పై హౌతీల డ్రోన్ దాడి..! విమానాశ్రయం వద్ద భారీ మంటలు.. దట్టమైన పొగ!
Riyadh Airport Fire
Balaraju Goud
|

Updated on: Sep 19, 2026 | 8:30 PM

Share

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం (సెప్టెంబర్ 19) కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆకాశంలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. యెమెన్‌కు చెందిన హౌతీల దాడుల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ ప్రాంతంలో మంటలు కనిపించినట్లు రాయిటర్స్‌ వీడియోలు, ఫొటోలు చూపించాయి.

రియాద్‌, సమీపంలోని అల్-ఖర్జ్ ప్రాంతాల్లో వైమానిక ముప్పు ఉందంటూ సౌదీ పౌర రక్షణ విభాగం రాత్రివేళ ప్రజలకు మొబైల్ అలర్ట్‌లు పంపింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అనంతరం శనివారం ఉదయం పరిస్థితి అదుపులోకి వచ్చిందంటూ ‘ఆల్ క్లియర్’ ప్రకటించింది. రియాద్‌లోని ఓ ప్రాంతంలో ఉన్న రాయిటర్స్‌ జర్నలిస్ట్ పేలుళ్లలాంటి శబ్దాలు విన్నట్లు సంస్థ తెలిపింది.

ఇంధన నిల్వ కేంద్రం వద్ద మంటలు

ఈ దృశ్యాల్లో విమానాశ్రయ ప్రధాన టెర్మినల్‌, రహదారులు కనిపిస్తుండగా.. వెనుకవైపు భారీగా నల్లటి పొగ ఎగసినట్లు నమోదైంది. ఒక దశలో ఇంధన ట్యాంకులుగా కనిపిస్తున్న ప్రాంతం వెనుక మంటలు కూడా కనిపించాయి. అయితే మంటలకు ఖచ్చితమైన కారణం, నష్టం ఎంత జరిగిందన్న దానిపై సౌదీ ప్రభుత్వ మీడియా కార్యాలయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

హౌతీ-సౌదీ ఘర్షణ మళ్లీ తీవ్రం

2022లో ఏర్పడిన కాల్పుల విరమణ తర్వాత కొంతకాలం సౌదీ-హౌతీ ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. అయితే 2026 జూలై నుంచి హౌతీలు సౌదీపై మళ్లీ దాడులు ప్రారంభించారు. ఇటీవలి రోజుల్లో సౌదీ నగరాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరిగినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ఈ పరిణామాల మధ్య ఎర్ర సముద్రం, బాబ్‌ ఎల్‌-మండేబ్‌ మార్గాల భద్రతపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం ప్రపంచ ఇంధన, వాణిజ్య రవాణాకు కీలకమైన సముద్ర మార్గం కావడంతో పరిస్థితిపై అంతర్జాతీయంగా దృష్టి నెలకొంది.

ఇదిలా ఉండగా, హౌతీలు సౌదీపై దాడులను కొనసాగిస్తామని హెచ్చరిస్తుండగా.. సౌదీ అరేబియా యెమెన్‌లో హౌతీల స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ పరస్పర దాడులతో యెమెన్‌ సంక్షోభం మరోసారి ప్రాంతీయ స్థాయిలో తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us