ఆ దేశంలో నిండుకుంటున్న ఇంధన నిల్వలు..పెళ్ళిలో ఒకే వంటకం
ఆ దేశం వద్ద కేవలం 28 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయి. సౌదీ అరేబియాపై హౌతీలు కొనసాగిస్తున్న దాడులు పాకిస్థాన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసాయి. అంతర్జాతీయంగా బారెల్ ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమనడంతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం, ఎక్కువ ధరలు పెట్టి చమురును దిగుమతి చేసుకోలేకపోతోంది.

అంతేకాదు, మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్టు క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డలర్ల మార్కును దాటడంతో, ఇంధన దిగుమతులపై ఆధారపడిన పాకిస్తాన్‌పై విపరీతమైన ఆర్థిక భారం పడింది. పాకిస్తాన్ వద్ద సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు లేకపోవడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలకు ఇంధనాన్ని కొనుగోలు చేయడం ఆ దేశానికి కష్టంగా మారుతోంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం, ఎక్కువ ధరలకు చమురును దిగుమతి చేసుకోలేకపోతోంది. దీంతో దేశంలోని నిల్వలు కేవలం 28 రోజులకు మాత్రమే సరిపడే స్థాయికి పడిపోయాయి.
ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ‘లాక్‌డౌన్’ తరహా ఆంక్షలను అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 9 గంటలకే మూసివేయాలి. అలాగే మ్యారేజ్ హాల్స్ రాత్రి 10 గంటలకు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటలకు బంద్ చేయాలి. ప్రభుత్వ అధికారులు విదేశీ పర్యటనలు చేయకుండా మూడు నెలల పాటు నిషేధం విధించారు. వీలైనంత వరకు సమావేశాలను భౌతికంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహించాలి. అన్ని మంత్రిత్వ శాఖలు ఖర్చులను 5% మేర తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విదేశీ ప్రతినిధుల రాక మినహా, ప్రభుత్వం తరఫున అధికారిక విందులు, సెమినార్లు సమావేశాలు నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలు, రిక్షాలు, 800 సీసీ లోపు చిన్న కార్లు వాడే సామాన్యుల కోసం లీటరుకు 100 రూపాయల చొప్పున ప్రత్యేక ఇంధన సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించనుంది.
పెళ్ళిలో ఇక పస్తులే
పెళ్లిళ్లంటేనే సందడి, హడావుడి… ముఖ్యంగా వంటకాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రకరకాల రుచులతో అతిథులకు ఘనంగా విందు ఇవ్వడం ఆనవాయితీ. ఏ పెళ్లైనా ఘనంగా జరిగిందంటే, అక్కడ పెట్టిన వంటకాల గురించే అంతా మాట్లాడుకుంటారు. కానీ, ఒకే రకం వంటకంతో సరిపెట్టుకోవాల్సి వస్తే… అది కూడా పెళ్లిళ్లలో ఎక్కువ రకాల వంటకాలు వడ్డించడానికి వీలులేని పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి విచిత్రమైన, కఠినమైన పరిస్థితే పాకిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొంది! వివాహ వేడుకల్లో కేవలం ‘ఒక వంటకం’ మాత్రమే వడ్డించేలా నిబంధన తెచ్చారు.
సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై హౌతీల దాడులు, గల్ఫ్ దేశాల సముద్ర మార్గాల్లో భద్రత తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అస్థిరంగా మారాయి. దీనివల్ల పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగాయి. ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ. 4.10, హై స్పీడ్ డీజిల్‌పై రూ. 6.41 పెంచింది. దీంతో పాకిస్థాన్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 384.34కి, డీజిల్ ధర రూ. 415.83కి చేరుకున్నాయి. ఈ భారీ ధరల భారాన్ని పూర్తిగా భరించే ఆర్థిక స్థోమత పాకిస్థాన్ ప్రభుత్వం వద్ద లేదు. అందుకే, ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడమే ప్రస్తుతానికి ఏకైక మార్గమని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం భావిస్తోంది.