AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ఉందా? అసలు నిజమేంటి?

యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ఉందా? అసలు నిజమేంటి?

Phani CH
|

Updated on: Sep 18, 2026 | 10:19 PM

Share

అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000కు మించిన నిర్దిష్ట యూపీఐ వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ అమల్లోకి రానుంది. అయితే ఈ ఛార్జీ నేరుగా వినియోగదారులు చెల్లించాల్సినది కాదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI చెల్లింపులు ఉచితంగానే ఉంటాయి. మరోవైపు ఈ నిర్ణయం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించగా, కేంద్ర ప్రభుత్వం ఆ వాదనను తిరస్కరించింది.

ఇన్నాళ్లూ పూర్తిగా ఉచితంగా సాగిపోయిన యూపీఐ (UPI) లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఆన్‌లైన్‌లో రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు తీసుకురావడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా తెరపైకి వచ్చాయి. యూపీఐపై ఇన్నాళ్లుగా కొనసాగుతున్న జీరో ఎండీఆర్ విధానాన్ని అమెరికాకు చెందిన చెల్లింపుల సంస్థలు వ్యతిరేకిస్తున్నాయని, ఆ ఒత్తిడితోనే కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం నిర్ణయం వెనుక నిజంగా అమెరికా ఒత్తిడి ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న తీవ్ర చర్చకు దారితీసింది. రూ.2 వేలకు మించిన కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి రానుంది. అయితే ఇది వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసే ఛార్జీ కాదని కేంద్రం అంటోంది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులు కూడా పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న యూపీఐపై ఛార్జీలు వచ్చాయా అన్నది మాత్రమే కాదు. ఈ నిర్ణయం వెనుక ఆర్థిక కారణాలే ఉన్నాయా? లేక అమెరికా ఒత్తిడి కూడా ఉందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఆన్‌లైన్‌లో రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు బాదుతారనే వార్తలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫోన్‌పే, గూగుల్‌ పే లేదా ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా షాపుల్లో డబ్బులు చెల్లించినా, స్నేహితులకు పంపినా మన జేబుకు చిల్లు పడుతుందా? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? కొత్త రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? మనం దైనందిన జీవితంలో కిరాణా కొట్లలో సామాన్లు కొన్నా, మాల్స్‌లో షాపింగ్ చేసినా ఫోన్ తీసి క్షణాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తుంటాం. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి (P2P) డబ్బులు పంపినప్పుడు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉదాహరణకు మీ స్నేహితుడికి రూ.10 వేలు పంపినా, కుటుంబ సభ్యులకు బదిలీ చేసినా రూపాయి కూడా అదనంగా కట్టాల్సిన అవసరం లేదు. మరి ఈ ఛార్జీల వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటే.. కొత్త నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 నుంచి కొన్ని నిర్దిష్టమైన వ్యాపార చెల్లింపులపై మాత్రమే ‘ఎండీఆర్‌’ వర్తిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఛార్జీలను సాధారణ కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వ్యాపారులు మాత్రమే దీన్ని భరించాల్సి ఉంటుంది. మీరు ఏ వ్యక్తికైనా ఎంత మొత్తమైనా ఉచితంగా పంపుకోవచ్చు. అయితే ఒక వ్యాపారికి లేదా పెద్ద సంస్థకు రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు చేసే సందర్భాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇక సాధారణ వ్యాపార లావాదేవీల్లో రూ.2,000 దాటిన చెల్లింపులపై కొన్ని సందర్భాల్లో 0.4 శాతం వరకు ఎండీఆర్‌ వర్తించవచ్చు. అయితే ఈ మొత్తాన్ని ఎప్పుడూ కస్టమర్ల నుంచి వసూలు చేయకూడదు. ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300 వరకు పరిమితం చేశారు. ఉదాహరణకు రెస్టారెంట్‌లో రూ.6,000 బిల్లు కడితే వచ్చే ఎండీఆర్‌ను రెస్టారెంట్ యజమానే భరిస్తారు. మీరు కేవలం ఆ రూ.6,000 మాత్రమే చెల్లిస్తారు. ఇక పెట్రోల్ బంకులు, రైల్వే టికెట్లు, టెలికాం, ఇన్సూరెన్స్, వ్యవసాయ రంగానికి సంబంధించిన చెల్లింపుల్లో రూ.2,000 దాటితే రూ.5 ఫ్లాట్ ఎండీఆర్‌ ఉంటుంది. ఇది కూడా వ్యాపారే భరించాలి తప్ప కస్టమర్ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా పోదు. చిన్న కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులు, తోపుడు బండ్లు నడిపే చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ నిబంధనల గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూపీఐ ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు లావాదేవీలు పొందే చిన్న వ్యాపారులకు ‘జీరో ఎండీఆర్‌’ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది. ఆర్థిక శాఖ, ఆర్బీఐ (RBI) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఎండీఆర్‌ నిబంధనల వల్ల దేశంలోని మొత్తం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96 శాతం లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంటే వార్తల్లో వస్తున్నట్లుగా సామాన్యులపై ఎలాంటి కొత్త భారం పడటం లేదన్నది స్పష్టమవుతోంది. ఈ ఎండీఆర్‌ డబ్బులు ఎవరికి వెళ్తాయి? అసలు ఈ విధానం ఎందుకు? అంటే… ఈ ఎండీఆర్‌ అనేది ప్రభుత్వానికి చెల్లించే పన్ను కాదు. యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే సేవలకు సంబంధించి బ్యాంకులు, చెల్లింపు గేట్‌వేలు నిర్వహించే సంస్థలకు వెళ్లే చిన్న మొత్తంలో ఉండే సర్వీస్ ఛార్జ్ ఇది. యూపీఐ లాంటి బృహత్తర డిజిటల్ వ్యవస్థను నిరంతరం సురక్షితంగా నడపడానికి, భద్రతా ప్రమాణాలను పెంచడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా షాపు యజమాని యూపీఐ ద్వారా బిల్లు చెల్లించినందుకు అదనపు ఛార్జీలు ఇవ్వాలని మీపై ఒత్తిడి తెస్తే అది నిబంధనలకు విరుద్ధం. బ్యాంకులు, వ్యాపారులు ఈ ఎండీఆర్‌ను కస్టమర్ల నుంచి వసూలు చేయకూడదని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ వంటి ఏ యాప్ ద్వారా పేమెంట్ చేసినా సామాన్యుడికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక ఈ కొత్త విధానం వెనుక ఎలాంటి విదేశీ లేదా అమెరికా ఒత్తిళ్లు లేవని, భారత్ తన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను స్వతంత్రంగా, దీర్ఘకాలికంగా ఆర్థికంగా నిలకడగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. మీ రోజువారీ లావాదేవీలన్నీ మునుపటిలాగే పూర్తిగా ఉచితంగా సాగిపోతాయి. కాబట్టి సామాన్యులు ఎలాంటి అపోహలు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జలపాతం వద్ద షాకింగ్ సీన్..

గడువు దాటితే.. లైసెన్స్‌ రద్దే!

ఒక్క కాగితం.. స్మృతి మంధాన జీవితాన్నే మార్చేసింది

ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే

కృత్రిమ సూర్యుడి దిశగా భారత్ కీలక ముందడుగు..

Follow Us