AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాగుబోతు భర్త కొడుతున్నాడంటూ MLA వద్దకు మహిళ.. ఆమె ఏం చేశారంటే..?

భర్త వేధింపులతో ఇబ్బందులు పడుతున్న గుంటూరుకు చెందిన రిజ్వానాకు పోలీస్ స్టేషన్‌లో అనుకోని పరిస్థితి ఎదురైంది. కేసు నమోదు చేయాలంటే స్థానికంగా తెలిసిన వ్యక్తిని వెంట తీసుకురావాలని పోలీసులు చెప్పినట్లు ఆమె ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎమ్మెల్యే స్వయంగా మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయించారు. మహిళల భద్రత విషయంలో పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.

తాగుబోతు భర్త కొడుతున్నాడంటూ MLA వద్దకు మహిళ.. ఆమె ఏం చేశారంటే..?
MLA Galla Madhavi
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 19, 2026 | 12:18 PM

Share

గుంటూరు నగరానికి చెందిన రిజ్వానాకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా భర్తతో ఆమెకు విభేదాలు కొనసాగుతున్నాయి. మద్యం సేవించి ఇంటికి వస్తున్న భర్త తనను కొడుతూ వేధిస్తున్నాడని రిజ్వానా ఆరోపించింది. దీంతో కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నప్పటికీ.. అతడి వేధింపులు మాత్రం ఆగలేదని తెలిపింది. భర్త వేధింపులతో విసిగిపోయిన రిజ్వానా.. తనకు న్యాయం చేయాలంటూ గుంటూరు వెస్ట్ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అయితే ప్రస్తుతం తాను కందుకూరులో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు.. స్థానికంగా తనకు తెలిసిన ఎవరినైనా వెంట తీసుకురావాలని సూచించినట్లు ఆమె తెలిపింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక రిజ్వానా తీవ్ర ఆందోళనకు గురైంది.

ఒకవైపు భర్త వేధింపులు.. మరోవైపు ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోలేదన్న ఆవేదనతో ఆమె మరింత కుంగిపోయింది. ఈ క్రమంలో ప్రతి మంగళవారం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తన కార్యాలయంలో మహిళల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం గురించి తెలుసుకుంది. దీంతో ఆమె నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి తన సమస్యను వివరించింది. పోలీసులు ఎవరైనా తన వెంట వస్తేనే కేసు నమోదు చేస్తామని చెబుతున్నారని ఎమ్మెల్యేకు రిజ్వానా వివరించింది. దీంతో గల్లా మాధవి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రిజ్వానాను తన వెంట తీసుకుని గుంటూరు వెస్ట్ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

ఎమ్మెల్యే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు రావడంతో అక్కడి సిబ్బంది స్పందించారు. “బాధితురాలి తరఫున నేనే వచ్చాను.. కేసు నమోదు చేయండి” అని ఎమ్మెల్యే పోలీసులను కోరారు. అనంతరం పోలీసులు రిజ్వానా భర్తపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

అయితే ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. రిజ్వానా ఆధార్ కార్డులో కందుకూరు చిరునామా ఉందని, ప్రస్తుతం ఆమె కూడా అక్కడే ఉంటున్నట్లు సమాచారం ఉండటంతో.. స్థానికంగా ఎవరైనా తెలిసిన వారిని వెంట తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు. కేసు నమోదు చేయొద్దని తాము చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే రిజ్వానా ఎమ్మెల్యేను కలిసి “ఎవరైనా వస్తేనే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారని” వివరించడంతో ఈ వ్యవహారం వివాదంగా మారిందని పేర్కొన్నారు.

మరోవైపు మహిళల భద్రత, రక్షణ విషయంలో పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మహిళలకు సంబంధించిన సమస్యలపై స్పందించడంలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Follow Us