AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తరాలు మారిన చెరగని ఐక్యత.. 50 ఏళ్లుగా ఒకే గణపతిని ప్రతిష్టిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం!

కాలంతో పాటు కల్చర్‌ కూడా మారిపోయింది.. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఇప్పుడు వీధివీధిలో వినాయకుడు దర్శనమిస్తున్నారు.. ఐక్యతకు నిదర్శనంగా జరుపుకునే పండగకు అర్థాన్నే మార్చేశారు. ఇలాంటి రోజుల్లోనూ ఓ గ్రామం మాత్రం.. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని అలాగే కొనసాగిస్తోంది.. ఒకే ఊరు, ఒకే గణపతి పేరుతో ప్రతి ఏటా గ్రామంలో కేవలం ఒకే గణపతిని ఏర్పాటు చేసి.. ఊరంతా ఐక్యతో పండగను జరుపుతోంది. ఆ గ్రామం గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తరాలు మారిన చెరగని ఐక్యత.. 50 ఏళ్లుగా ఒకే గణపతిని ప్రతిష్టిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం!
Narayanpets Eklaspur Village Unites For Vinayaka Chavithi
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Sep 19, 2026 | 11:25 AM

Share

వినాయక చవితి వచ్చిందంటే ప్రతి వీధిలోనూ.. ప్రతి ఇంటి ముందు గణనాథుడి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఒక్కో గల్లీలో ఒక్కో వినాయకుడిని ప్రతిష్టించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం సాధారణంగా కనిపిస్తుంది. కొన్ని కాలనీల్లో అయితే రెండు, మూడు విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కొలుస్తుంటారు. కానీ నారాయణపేట జిల్లా ఎక్లాస్ పూర్ గ్రామంలో మాత్రం దీనికి భిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఊరంతా కలిసి ఒకే వినాయకుడిని ప్రతిష్టించి.. గ్రామమంతా ఒక్క కుటుంబంలా పండుగ జరుపుకుంటోంది. దాదాపు 50ఏళ్లుగా ఈ ప్రత్యేక ఆనవాయితీని గ్రామస్తులు కొనసాగిస్తున్నారు.

ఏటా వినాయక చవితి సందర్భంగా గోవిందరాజుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామంలో గణనాథుడిని ప్రతిష్ఠిస్తారు. వినాయకుడి ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ గ్రామస్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

ఎక్లాస్ పూర్ వినాయక వేడుకల్లో మరో ప్రత్యేకత ప్రతి ఇంటి భాగస్వామ్యం. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి గణనాథుడికి నైవేద్యాలు సమర్పిస్తారు. తమ ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి సమర్పించి… అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. ఇలా ఒక్కో ఇంటి నుంచి వచ్చే నైవేద్యంతో గ్రామమంతా కలిసి పండుగను జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. ఈ వేడుకల కేవలం పూజలకే పరిమితం కావడం లేదు. వినాయకుడి మండపం వద్ద యువత ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పిల్లలు, యువకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ ప్రతిభను పదర్శిస్తున్నారు. సాయంత్రం వేళల్లో మండపం వద్ద సందడి నెలకుంటోంది. భక్తి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామస్తులను ఆకట్టుకుంటున్నాయి.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం వెనుక గ్రామస్తుల ఐక్యత కనిపిస్తోంది. కాలం మారినా.. పండుగను జరుపుకునే విధానం మారినా.. ఎక్లాస్ పూర్ లో మాత్రం తరతరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీని వదలడం లేదు. పెద్దలు ప్రారంభించిన సంప్రదాయాన్ని నేటి తరం సైతం అదే భక్తి, ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us