AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palnadu: పసి మొగ్గలపై లైంగిక దాడులు.. నిందితుడికి కఠిన శిక్ష వేసిన గుంటూరు కోర్టు

బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన లారీ క్లీనర్ మిరియాల జయరావుకు రెండు వేర్వేరు కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి. 2019లో రెంటచింతల మండలంలో ఐదేళ్ల బాలికపై దాడి చేసిన కేసులో రూ.20 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Palnadu: పసి మొగ్గలపై లైంగిక దాడులు.. నిందితుడికి కఠిన శిక్ష వేసిన గుంటూరు కోర్టు
Guntur Court
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 19, 2026 | 12:29 PM

Share

పల్నాడు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మద్యం, చెడు వ్యసనాలకు బానిసై దారుణాలకు పాల్పడ్డాడు. లారీ క్లీనర్‌గా పనిచేస్తూ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన అతనికి రెండు వేర్వేరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో న్యాయస్థానాలు జీవిత ఖైదు శిక్షలు విధించాయి. ఒకే నిందితుడికి వేర్వేరు కేసుల్లో రెండుసార్లు జీవిత ఖైదు పడటం చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమ్రతుకోటకు చెందిన మిరియాల జయరావు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అతడి ప్రవర్తనతో కుటుంబ సభ్యులు సైతం అతనికి దూరంగా ఉన్నారు. లారీ క్లీనర్‌గా పనిచేసే జయరావు చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

2019లో ఐదేళ్ల బాలికపై దాడి

2019లో రెంటచింతల మండలానికి చెందిన ఐదేళ్ల బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లి, అమ్మమ్మ సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోని ఓ రైస్ మిల్లులో జయరావు బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన జయరావు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తీవ్ర అస్వస్థతకు గురై ఉండటాన్ని గమనించిన తల్లి వెంటనే ఆమెను గురజాల ఆసుపత్రికి తరలించింది. అక్కడ బాలికకు చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జయరావును అరెస్ట్ చేశారు. అతనికి ఆశ్రయం కల్పించిన ఓ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో జయరావుపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పర్వీన్ సుల్తానా బేగం అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం అందించాలని కూడా ఆదేశించారు.

2024లో మరో ఐదేళ్ల బాలికపై దాడి

అయితే ఈ తీర్పు వెలువడటానికి నెల రోజుల ముందే మచిలీపట్నం పోక్సో కోర్టు మరో కేసులో జయరావుకు జీవిత ఖైదు విధించింది. 2024లో లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న సమయంలో నూజివీడు మండలంలోని ఓ ఐదేళ్ల బాలికపై జయరావు లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం జయరావుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో మచిలీపట్నం పోక్సో కోర్టు అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న జయరావును మరో కేసు విచారణ నిమిత్తం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ కూడా నేరం రుజువు కావడంతో న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. అనంతరం నిందితుడిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.

Follow Us