డబ్బు లేకుండా బతుకుతున్న మహిళ.. పురాతన బార్టర్ సిస్టమ్ తో జీవనం
56 ఏళ్ల వయసున్న జో నెమెత్ కి సొంత ఇల్లు గానీ, ఆస్తులు గానీ లేవు. ఆస్ట్రేలియాకు చెందిన జో నెమెత్ సోషల్ వర్కర్ గా పనిచేసింది. 2015లో తన ఉద్యోగాన్ని వదిలేసి డబ్బుపై ఆధారపడకుండా జీవించాలనే కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డబ్బును కుమార్తె అమీకి ఇచ్చేసి, తన బ్యాంకు ఖాతాను క్లోజ్ చేసింది. .

డబ్బు లేకుండా మొదటి మూడేళ్లు జో నెమెత్ ఓ స్నేహితురాలికి చెందిన పల్లెటూరి ఇంట్లో గడిపింది. మరో స్నేహితురాలి పెరట్లో నిలిపి ఉంచిన ట్రక్కులో కొంతకాలం ఉంది. చివరకు షరాన్ బ్రాడీ అనే స్నేహితురాలి ఇంట్లోకి శాశ్వతంగా మారింది. ఇంటి అద్దెకు బదులుగా ఇంటి పనులలో సహాయం చేస్తుంది. వంట చేస్తుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది, తోటను చూసుకోవడంతో పాటు సబ్బులు, డిటర్జెంట్లను తయారు చేస్తుంది. పర్యావరణ నష్టాన్ని తగ్గించాలన్న జో లక్ష్యానికి ఈ విధంగా పూర్తి మద్దతు లభిస్తోంది. తన దంతాలకు వైద్య చికిత్స అవసరమైనప్పుడు, డబ్బుకు బదులుగా తన నైపుణ్యాలను అందించిందట. సోయాతో పనీర్ ఎలా చేయాలి యాపిల్ పొట్టుతో వెనిగర్ తయారీ వంటివి నేర్పించి వైద్య ఖర్చును భర్తీ చేసిందట. ఆమె వద్ద కారు కానీ వేరే వాహనం కానీ లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ లో వెళ్లాల్సిందే. అయితే ఒక్కోసారి లిఫ్ట్ అడగడానికి వెనుకాడననీ ఆమె ఇంటర్వ్యూలో తెలిపింది.
జీతం కోసం నిత్యం ఎదురుచూపులు
సమాజంలో పెరిగిపోతున్న వినిమయ సంస్కృతి విష ప్రభావం తీవ్రంగా కలచివేసిందని తను స్వయంగా ఆర్థిక ఒత్తిడిని అనుభవించినట్లు జో ఆర్ఎన్‌జెడ్ (RNZ) ఛానెల్ లో ‘సాటర్డే మార్నింగ్’ ఇంటర్బ్యూలో తెలిపింది. తన నిర్ణయం వెనుక కారణాలను వివరించింది. రోజూవారీ ఖర్చులను భరించడం కష్టంగా మారిందనీ, జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశాననీ చెప్పుకొచ్చింది. అది తనపై ఒత్తిడి పెంచిందని ఆమె తెలిపింది.
షాపింగ్ వ్యవస్థలో ఇరుక్కున్న భావన
మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు తయారీ వెనుక కార్మికులు పడే కష్టాలు అలాగే పర్యావరణానికి జరిగే నష్టం వాటికి సంబంధించిన వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయని జో నెమెత్ తెలిపింది.
డబ్బు లేకుండా జీవించి చూపిస్తా
పశ్చిమ దేశాల్లో కొందరు డబ్బు లేకుండా జీవిస్తున్నారని చదవడం జో ఆలోచనా విధానాన్ని మార్చేసిందట. ‘ది మనీలెస్ మ్యాన్: ఏ ఇయర్ ఆఫ్ ఫ్రీకనమిక్ లివింగ్’ అనే మార్క్ బోయిల్ పుస్తకం తన పై ప్రభావం చూపిందిట. దాంతో తాను ప్రశాంతంగా జీవించడానికి ఏయే వస్తువులు అవసరమో జాబితాను సిద్ధం చేసుకుందనీ తన వద్ద ఇప్పటికే వంట పాత్రలు, టూత్‌బ్రష్ ఉండటంతో.. పర్యావరణానికి, ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవించడానికి తనకు అంతకంటె ఏమీ అవసరం లేదని గ్రహించినట్లు చెప్పింది.
కలిసి జీవించడంలోనే ఆనందంలో ఉందనీ డబ్బు లేకుండా జీవించడం వల్ల లభించే అతిపెద్ద ప్రయోజనాలలో అదొకటని, అనారోగ్యంతో ఉన్న స్నేహితులను వారి పిల్లలను చూసుకోవడం, వారికి తోటపనులలో సాయం చేస్తున్నట్లు ఆమె చెప్పింది.