ప్రతీ దానికి ఓ లెక్కుంటుంది.. సోషల్ మీడియా పోస్టు విషయంలో ఎప్పుడు కేసు అవుతుంది..?
సోషల్ మీడియాలో ప్రభుత్వం, పార్టీలు, నేతలను విమర్శించడం మాత్రమే నేరం కాదు. అయితే నిర్ధారణ లేని వ్యక్తిగత ఆరోపణలు, పరువునష్టం కలిగించే ప్రచారం, బెదిరింపులు లేదా ఇతర చట్టపరమైన నేరాలకు దారితీసే కంటెంట్‌పై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. BNS సెక్షన్ 356 పరువునష్టాన్ని నిర్వచిస్తుండగా, BNSS సెక్షన్ 35 అరెస్టు, నోటీసు విధానాన్ని నిర్దేశిస్తుంది.

ఒకప్పుడు మన ఊర్లో నలుగురు కూర్చొని మాట్లాడుకునేవాళ్లం. మనసులో ఉన్నది చెప్పుకునేవాళ్లం. ఎవరికైనా నచ్చకపోతే అక్కడికక్కడే మాటామాటా జరిగేది. కానీ విషయం అక్కడితో ఆగిపోయేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. చేతిలో మొబైల్ ఉంది. అందులో సోషల్ మీడియా ఉంది. మనం రాసిన మాట క్షణాల్లో వేల మందికి చేరుతోంది. ఒక ఫొటో, ఒక వీడియో, ఒక పోస్టు నిమిషాల్లో వైరల్ అవుతోంది. మనం పెట్టిన మాటను ఇంకొకరు స్క్రీన్‌షాట్ తీస్తారు. మరొకరు ఫార్వర్డ్ చేస్తారు. ఇంకొకరు వీడియోగా మార్చి పెడతారు. అందుకే సోషల్ మీడియాలో పెట్టే ప్రతి మాటకు ఒక బాధ్యత కూడా వచ్చింది.
తెలంగాణలో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు సంబంధించిన తాజా పరిణామాలతో ఈ విషయం మరోసారి చర్చలోకి వచ్చింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టుపై ఆయనపై కేసు నమోదైంది. సెప్టెంబర్ 19న తెలంగాణ హైకోర్టు ఆయనను అరెస్టు చేయవద్దని ఆదేశిస్తూ, BNS సెక్షన్ 35(3) ప్రకారం నోటీసు ఇచ్చి దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. కేసులో నమోదైన ఆరోపణలకు సంబంధించిన నేరాలకు మూడు సంవత్సరాల లోపు శిక్ష ఉందని కోర్టుకు తెలియజేశారు.
ఇక్కడ అసలు విషయం క్రిశాంక్ ఒక్కరి సంగతి కాదు. సోషల్ మీడియాలో మనం ఏం రాస్తే కేసు అవుతుంది, ఏది రాజకీయ విమర్శగా ఉంటుంది, ఏది వ్యక్తిగత ఆరోపణగా మారుతుంది, పోలీసులు ఫిర్యాదు నుంచి అరెస్టు వరకు ఎలా వెళ్తారు అన్నదే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం.
రాజకీయ విమర్శ చేయడం తప్పు కాదు..
ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నచ్చకపోతే విమర్శించొచ్చు. ఒక పార్టీ విధానం బాగోలేదని చెప్పొచ్చు. ఒక మంత్రి పని తీరు సరిగా లేదని అభిప్రాయం చెప్పొచ్చు. ఒక నాయకుడి రాజకీయ నిర్ణయాన్ని తప్పుబట్టొచ్చు. ఇవి ప్రజాస్వామ్యంలో సాధారణమైన రాజకీయ అభిప్రాయాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) భావప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది. అయితే ఈ స్వేచ్ఛకు చట్టపరమైన పరిమితులు కూడా ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే నేరం కాదు. కానీ ఆ విమర్శ పేరుతో ఒక వ్యక్తిపై నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం, బెదిరింపులు చేయడం, చట్టపరమైన నిషేధాలకు లోబడే కంటెంట్ ప్రచారం చేయడం వంటి వాటికి పరిస్థితిని బట్టి వేరే చట్టాలు వర్తించవచ్చు.
అభిప్రాయం వేరు.. ఆరోపణ వేరు
మన ఊర్లోనే ఉదాహరణ తీసుకుందాం. సర్పంచ్ పని సరిగ్గా చేయలేదంటే ఒక అభిప్రాయం. సర్పంచ్ తీసుకున్న నిర్ణయం వల్ల గ్రామానికి నష్టం జరిగిందంటే ఒక విధానంపై విమర్శ. కానీ సర్పంచ్ పది లక్షలు తిన్నాడనే ఆధారం లేకుండా నిజమైన విషయంలా ప్రచారం చేస్తే అది నిర్దిష్ట ఆరోపణ. ఈ రెండింటినీ ఒకేలా చూడలేం. సోషల్ మీడియాలో కూడా ఇదే లెక్క. విమర్శ చేస్తున్నామా, లేక ఒక వ్యక్తిపై వాస్తవ ఆరోపణ చేస్తున్నామా అన్నది చాలా ముఖ్యం.
పరువునష్టం
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 356 పరువునష్టం గురించి చెబుతుంది. ఒక వ్యక్తి ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా లేదా తన మాట వల్ల నష్టం జరుగుతుందని తెలిసి ఆరోపణ ప్రచురిస్తే పరువునష్టం అంశం రావచ్చు. అయితే చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. నిజమైన విషయాన్ని ప్రజా ప్రయోజనం కోసం ప్రచురించడం, ప్రజా సేవకుడి విధులపై మంచి విశ్వాసంతో అభిప్రాయం చెప్పడం వంటి అంశాలకు చట్టంలో మినహాయింపులు ఉన్నాయి. అంటే ప్రతి విమర్శ పరువునష్టం కాదు.అలాగే నేను రాజకీయంగా రాశానని చెప్పడం వల్ల ప్రతి వ్యక్తిగత ఆరోపణకు రక్షణ వస్తుందని కూడా అనుకోకూడదు.
తప్పుడు సమాచారం పెడితే?
ఇక్కడే సోషల్ మీడియా అసలు చిక్కు మొదలవుతుంది. పాత వీడియోను కొత్త ఘటనగా పెట్టడం. వేరే ప్రాంతంలో జరిగిన ఫొటోను తెలంగాణలో జరిగినట్టు చెప్పడం. ఎడిట్ చేసిన వీడియోను అసలు వీడియోగా ప్రచారం చేయడం. నిర్ధారణ కాని విషయాన్ని నిజమని రాయడం. ఇలాంటి వాటిపై పరిస్థితిని బట్టి చట్టపరమైన సమస్యలు రావచ్చు. అయితే తప్పుడు సమాచారం ఉందని ఒక్క కారణంతో ప్రతి పోస్టూ ఆటోమేటిక్‌గా నేరం కాదు. పోస్టులో ఏముంది, ఎవరి గురించి ఉంది, ఉద్దేశం ఏమిటి, దాని ప్రభావం ఏంటి, ఏ చట్టంలోని నేరానికి అవసరమైన అంశాలు నెరవేరుతున్నాయా అన్నది చూడాలి. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి నిజమే అనుకోవడం చాలా ప్రమాదకరం. నేను రాయలేదు.. ఫార్వర్డ్ చేశానంటే సరిపోదు. చాలామంది ఇక్కడే పొరబడతారు. నేను తయారు చేయలేదు. నాకు వచ్చినదాన్ని ఫార్వర్డ్ చేశాను అంటారు. కానీ ఫార్వర్డ్ చేయడం అంటే మన చేతుల మీదుగా ఆ సమాచారం ఇంకొకరికి చేరడం. అందుకే కంటెంట్ స్వభావం, మనం చేసిన వ్యాఖ్య, మన ఉద్దేశం వంటి విషయాలు కూడా పరిస్థితిని బట్టి పరిశీలించబడవచ్చు.
అదే సమయంలో ప్రతి ఫార్వర్డ్‌ను నేరంగా చూడలేం. కాబట్టి ఫార్వర్డ్ చేసే ముందు కనీసం మూలం ఏంటి, విషయం నిజమేనా అన్నది చూసుకోవడం మంచిది.
మీమ్. వ్యంగ్యం. కార్టూన్‌కు ఇదే లెక్క
రాజకీయ మీమ్ పెట్టడం, వ్యంగ్యంగా మాట్లాడటం, కార్టూన్ వేయడం సాధారణంగా రాజకీయ వ్యాఖ్యానంలో భాగమే. ప్రతి మీమ్ నేరం కాదు. ప్రతి వ్యంగ్యం కేసు కాదు. కానీ వ్యంగ్యం పేరుతో ఒక వ్యక్తిపై నిర్ధారణ లేని వాస్తవ ఆరోపణలు చేయడం, బెదిరింపులు చేయడం లేదా ఇతర చట్టపరమైన నేరాలకు దారితీసే కంటెంట్ పెట్టడం వేరే విషయం. అందుకే అది జోక్ మాత్రమే అని చెప్పడం అన్ని సందర్భాల్లో సరిపోదు. కామెంట్ పెట్టినా జాగ్రత్తగానే ఉండాలి. అసలు పోస్టు పెట్టిన వ్యక్తి మాత్రమే కాదు. కామెంట్‌లో మనం రాసే మాటలు కూడా ముఖ్యం.ఒక పోస్టు కింద ఈ నిర్ణయం తప్పు అని రాయడం ఒక విషయం. అదే కామెంట్‌లో ఒక వ్యక్తిపై కొత్త ఆరోపణ చేయడం లేదా బెదిరింపు ఇవ్వడం మరో విషయం. అందుకే కామెంట్ బాక్స్ కూడా చట్టం లేని చోటు కాదు.
పోలీసులకు ఫిర్యాదు వస్తే ఏం జరుగుతుంది?
ఒక సోషల్ మీడియా పోస్టుపై అభ్యంతరం ఉన్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులో నేరానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించవచ్చు. ఆ తర్వాత పోస్టు ఎవరు పెట్టారు, ఏ ఖాతా నుంచి పెట్టారు, ఎప్పుడు పెట్టారు, అసలు కంటెంట్ ఏమిటి, దానికి ఆధారాలు ఏమిటి వంటి అంశాలను పరిశీలిస్తారు. పోస్టు, వీడియో, స్క్రీన్‌షాట్, లింక్, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా దర్యాప్తులో పరిశీలించే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా విషయం ఇలా ముందుకు వెళ్లవచ్చు.
ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు, నోటీసు లేదా ఇతర చట్టపరమైన చర్య, అవసరమైతే అరెస్టు, కోర్టు ప్రక్రియ వరుసగా ఉంటాయి. ప్రతి కేసులో ఇదే క్రమం తప్పనిసరిగా ఉండాలని కాదు. వర్తించే నేరం, పరిస్థితులు, చట్టపరమైన నిబంధనల ఆధారంగా ప్రక్రియ మారవచ్చు.
ఎఫ్‌ఐఆర్ అంటే
ఎఫ్‌ఐఆర్ నమోదైందంటే వెంటనే అరెస్టు చేయాల్సిందే అని కాదు. నేరం స్వభావం, శిక్ష, దర్యాప్తుకు వ్యక్తి సహకరిస్తున్నాడా, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా వంటి అంశాలను చట్టపరమైన విధానంలో పరిశీలిస్తారు. BNSS సెక్షన్ 35లో కొన్ని పరిస్థితుల్లో అరెస్టుకు బదులుగా నోటీసు ఇచ్చి దర్యాప్తుకు హాజరు కావాలని చెప్పే విధానం ఉంది. క్రిశాంక్ కేసులో తెలంగాణ హైకోర్టు కూడా సెక్షన్ 35(3) ప్రకారం నోటీసు ఇచ్చి దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. కాబట్టి కేసు నమోదైంది అంటే అరెస్టు ఖాయం అని అనుకోవడం సరైనది కాదు.
పోస్టు డిలీట్ చేస్తే సమస్య పోతుందా?
ఇదీ చాలామంది చేసే పొరపాటు. పోస్టు డిలీట్ చేసినా అప్పటికే ఎవరో స్క్రీన్‌షాట్ తీసి ఉండొచ్చు. వీడియోను డౌన్‌లోడ్ చేసి ఉండొచ్చు. ఇంకొకరు ఫార్వర్డ్ చేసి ఉండొచ్చు. అందుకే డిలీట్ చేశాను కదా. ఇక సమస్య ఉండదని అనుకోవడం సరికాదు. అయితే పోస్టు డిలీట్ చేసినంత మాత్రాన నేరం రుజువైనట్టూ కాదు. మొత్తం కేసులోని ఆధారాలు, చట్టంలోని అవసరమైన అంశాలు, దర్యాప్తు ఫలితాలు అన్నీ ముఖ్యం.
ఐటీ చట్టం 66A గురించి తెలుసుకోవాలి
సోషల్ మీడియా కేసు అంటే ఇప్పటికీ కొందరు వెంటనే ఐటీ యాక్ట్ సెక్షన్ 66A పేరు చెబుతుంటారు. అది సరైంది కాదు. సుప్రీంకోర్టు 2015లో ష్రేయా సింఘాల్ కేసులో ఐటీ యాక్ట్ సెక్షన్ 66Aను కొట్టివేసింది. భావప్రకటన స్వేచ్ఛపై ఆ నిబంధన విధించిన పరిమితులు రాజ్యాంగపరంగా నిలబడవని కోర్టు తేల్చింది. అందుకే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు పెట్టాడు కాబట్టి 66A కింద కేసు అని చెప్పడం చట్టపరంగా తప్పు.
స్క్రీన్‌షాట్ కూడా ముఖ్యం?
సోషల్ మీడియాలో పెట్టిన కంటెంట్‌కు డిజిటల్ ఆధారాలు ఉండొచ్చు. స్క్రీన్‌షాట్, పోస్టు లింక్, వీడియో కాపీ, ఖాతా వివరాలు, పోస్టు చేసిన సమయం వంటి అంశాలు దర్యాప్తులో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకే పోస్టు పెట్టిన తర్వాత దాన్ని తొలగిస్తే అంతా మాయమైపోతుందని అనుకోవడం మంచిది కాదు. జర్నలిస్టులు, రాజకీయ కార్యకర్తలు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలి. ఆ తర్వాత దానికి ఆధారం ఉందా చూడాలి. ఒక వ్యక్తిపై ఆరోపణ అయితే దానికి పత్రం, అధికారిక ప్రకటన, కోర్టు రికార్డు లేదా నమ్మదగిన ఆధారం ఉందా పరిశీలించాలి. ఫొటో, వీడియో పాతదా కొత్తదా చూడాలి. ఆరోపణను నిర్ధారిత నిజంలా కాకుండా, అందుబాటులో ఉన్న ఆధారాల మేరకు రాయాలి. ఇతరుల పోస్టును ఫార్వర్డ్ చేస్తున్నా దాని నిజానిజాలు చూసుకోవాలి.
పోస్టు పెట్టే ముందు చెక్ చేసుకోవాలి. మూలం ఉందా, ఆధారం ఉందా, తేదీ సరైందా, ఫొటో లేదా వీడియో అసలుదేనా, వ్యక్తిపై ఆరోపణకు ఆధారం ఉందా, ఇది నా అభిప్రాయమా, లేక వాస్తవ ఆరోపణా, రేపు ఇదే పోస్టును ఆధారాలతో వివరించగలనా అని ఆలోచించాలి. ఈ చిన్న జాగ్రత్త చాలా పెద్ద చిక్కును తప్పించవచ్చు.
కేసు నమోదైతే నేరం రుజువైందని కాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎఫ్‌ఐఆర్ అంటే ఆరోపణలపై దర్యాప్తు మొదలైన దశ. అది కోర్టు తుది తీర్పు కాదు. దర్యాప్తు జరుగుతుంది. ఆధారాలు పరిశీలిస్తారు. అవసరమైతే కోర్టులో కేసు నడుస్తుంది. చివరికి నేరం రుజువైందా లేదా అన్నది న్యాయ ప్రక్రియలో నిర్ణయమవుతుంది. అందుకే కేసు నమోదైంది కాబట్టి ఆ వ్యక్తి నేరస్తుడు అని చెప్పడం కూడా సరైనది కాదు.
సోషల్ మీడియా కూడా బాధ్యతే
సోషల్ మీడియా మన చేతిలో ఉన్న పెద్ద మైక్ లాంటిది. మైక్ ఉందని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. మాటకు ఆధారం ఉండాలి. సందర్భం ఉండాలి. బాధ్యత ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత సోషల్ మీడియాకూ అచ్చంగా సరిపోతుంది. తొందరపడి వేసిన అడుగు వెనక్కి తీసుకోలేం. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కూడా అంతే. ఒక్కసారి బయటకు వెళ్లిందంటే దాని కాపీలు ఎక్కడెక్కడికి వెళ్లాయో చెప్పడం కష్టం. అందుకే రాజకీయ విమర్శ చేయకూడదని కాదు. ప్రభుత్వాన్ని విమర్శించొచ్చు. పార్టీల విధానాలను తప్పుబట్టొచ్చు. నాయకుల పనితీరుపై అభిప్రాయం చెప్పొచ్చు. కానీ అభిప్రాయాన్ని ఆరోపణగా మార్చకూడదు.
ఆరోపణ చేస్తే ఆధారం ఉండాలి. తప్పుడు సమాచారాన్ని నిజమని ప్రచారం చేయకూడదు. బెదిరింపులు, వ్యక్తిగత దూషణలు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో వేళ్లు కదిలే ముందు ఒక్కసారి బుర్ర కదలాలి. మాట మనదే అయినా. దాని బాధ్యత కూడా మనదే.
-కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.
