ఎడారి ఇసుక ఇళ్ల నిర్మాణానికి ఎందుకు వాడరు? 99 శాతం మందికి తెలియదు
ఎడారిలో ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తుంది. అయినా ఆ ఇసుకతో ఇళ్లు ఎందుకు నిర్మించరు? ఎడారి ఇసుక కణాలు చాలా మెత్తగా, గుండ్రంగా ఉండటంతో సిమెంట్‌తో బలమైన బంధం ఏర్పడదు. దీంతో కాంక్రీట్ బలం తగ్గే అవకాశం ఉంటుంది. నిర్మాణాలకు సరైన ఆకారం, పరిమాణం, నాణ్యత ఉన్న ఇసుకను ఉపయోగించడం చాలా ముఖ్యం.

ఎడారి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కంటికి కనిపించేది ఇసుకే. కిలోమీటర్ల మేర ఇసుక దిబ్బలు విస్తరించి ఉంటాయి. అయితే ఇంత ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇళ్ల నిర్మాణానికి మాత్రం సాధారణంగా ఈ ఇసుకను ఉపయోగించరు. దీనికి ప్రధాన కారణం ఇసుక రేణువుల స్వభావం, నిర్మాణ బలం, తేమ, మిశ్రమ లక్షణాలతో పాటు రవాణా, ప్రాసెసింగ్ వంటి అంశాలు.
ఇసుక అంతా ఒకేలా ఉండదు
నిర్మాణాల్లో ఉపయోగించే ఇసుకను సాధారణంగా నది ఇసుక లేదా ప్రత్యేకంగా తయారు చేసిన ఇసుక ఉపయోగిస్తారు. ఈ ఇసుక రేణువులకు ఒకదానితో ఒకటి పట్టుకునే సామర్థ్యం ఉంటుంది. కానీ ఎడారి ఇసుక కణాలు సాధారణంగా చాలా మెత్తగా, గుండ్రంగా, ఒకే పరిమాణంలో ఉంటాయి. గాలి ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణించే క్రమంలో అవి ఒకదానికొకటి రాపిడి చెంది గుండ్రటి ఆకారాన్ని సంతరించుకుంటాయి.
సిమెంట్‌తో బలమైన బంధం ఏర్పడదు
కాంక్రీట్ తయారీలో ఇసుక కీలకమైన పదార్థం. సిమెంట్, నీరు, ఇసుక, కంకర కలిసినప్పుడు బలమైన నిర్మాణం ఏర్పడుతుంది. అయితే ఎడారి ఇసుకలోని కణాలు చాలా సున్నితంగా, గుండ్రంగా ఉండటం వల్ల సిమెంట్‌తో అవసరమైన స్థాయిలో ఇంటర్‌లాకింగ్ ఏర్పడదు. ఫలితంగా తయారైన కాంక్రీట్ ఆశించినంత బలంగా ఉండకపోవచ్చు.
గాలి తీసుకొచ్చే ఇసుక మరో సమస్య
ఎడారి ప్రాంతాల్లో బలమైన గాలులు తరచూ వీస్తుంటాయి. ఇసుక రేణువులు గాలితో ఒకచోటు నుంచి మరోచోటుకు కదులుతుంటాయి. అదే ఇసుకను నిర్మాణాల్లో ఉపయోగించినా, దాని స్థిరత్వం, రేణువుల మధ్య బంధం వంటి అంశాలు సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా పునాదులు, గోడలు, స్తంభాలు వంటి కీలక నిర్మాణాల్లో స్థిరమైన పదార్థం అవసరం.
నీరు, ఉప్పు ప్రభావం కూడా కీలకమే
కొన్ని ఎడారి ప్రాంతాల్లో లభించే ఇసుకలో ఉప్పులు, ఇతర ఖనిజాలు ఉండే అవకాశం ఉంటుంది. నిర్మాణానికి ఉపయోగించే ఇసుకలో అనవసరమైన లవణాలు ఎక్కువగా ఉంటే, అవి కాంక్రీట్ లేదా ఇనుప రాడ్లపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే నిర్మాణానికి ఉపయోగించే ఇసుకను ముందుగా నాణ్యత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తారు.
మరి ఎడారి ఇసుకను అసలు ఉపయోగించరా?
అయితే ఎడారి ఇసుకను ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేసి, ఇతర పదార్థాలతో సరైన నిష్పత్తిలో కలిపి కొన్ని నిర్మాణ అవసరాలకు ఉపయోగించే మార్గాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే నేరుగా ఎడారిలో దొరికిన ఇసుకను తీసుకుని సిమెంట్‌తో కలిపి ఇల్లు కట్టడం మాత్రం సాధారణ నిర్మాణ పద్ధతి కాదు.
