ఏసీబీ వలకు చిక్కిన HMDA చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్.. భారీగా ఆస్తులు గుర్తింపు!
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మొత్తం 12 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ తనిఖీల్లో కీలకమైన ఆస్తుల పత్రాలు, విలువైన వస్తువులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

నానక్‌రాంగూడలోని సుమధుర అపార్ట్‌మెంట్‌లో ఉన్న రవీందర్ నివాసంతో పాటు ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల సమయంలో నాలుగు బ్యాంక్ లాకర్లను గుర్తించినట్లు సమాచారం. అలాగే ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఏసీబీ ప్రాథమిక వివరాల ప్రకారం, రవీందర్‌కు చెందిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.5 కోట్లకు పైగా ఉంటుందని నిర్ధారించారు. బహిరంగ మార్కెట్ విలువ మాత్రం రూ.50 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆస్తుల మూలాలు, ఆదాయ వివరాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోదాల్లో రవీందర్ నివాసంలో రూ.4 లక్షల నగదు, సుమారు అర కిలో బంగారం, వెండి వస్తువులు, విలువైన ఆభరణాలు, రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు గుర్తించినట్లు సమాచారం. అదనంగా 18 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఏసీబీ గుర్తించిన ఆస్తుల్లో కొండాపూర్‌లోని మసీద్‌బండ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం, సుమధుర ఆక్రోపోలిస్‌లో ఒక ఫ్లాట్, శ్రీహరి మెడోస్‌లో మరో ఫ్లాట్, వాసవి ప్రాజెక్ట్‌లో మూడు ప్లాట్లు, అట్లాంటిస్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే శంషాబాద్, షాబాద్ ప్రాంతాల్లో నాలుగు ఎకరాల భూమి, జడ్చర్లలో ఏడు ఫ్లాట్లు, కొండాపూర్‌లో మరో రెండు ఫ్లాట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై రవీందర్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ, స్వాధీనం చేసుకున్న పత్రాలు, బ్యాంకు రికార్డులు, ఆస్తుల వివరాలను విశ్లేషిస్తోంది. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఆస్తుల విలువ, అక్రమాలపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..