BJP Executive Meet: జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ పదాధికారుల సమావేశం.. పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చ..
జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో HICCకి క్యూ కడుతున్నారు బీజేపీ ముఖ్య నాయకులు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
BJP office bearers meeting: భాగ్యనగరంలో బీజేపీ నేతల సందడి నెలకొంది. HICCలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా బీజేపీ చీఫ్ నడ్డా నేతృత్వంలో పదాధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి 148 మంది ఆఫీస్ బ్యారర్లు హాజరయ్యారు. కార్యవర్గం సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా బీజేపీ సంస్థాగత బలోపేతంపై వ్యూహాలను రచించనున్నారు. కాగా.. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో HICCకి క్యూ కడుతున్నారు బీజేపీ ముఖ్య నాయకులు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు.. బీజేపీ పాలిత 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మొత్తం 352 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులపై చర్చించనున్నారు. బీజేపీ రాజకీయ తీర్మానాలపై కూడా చర్చించనున్నారు. మోదీ 8ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి..తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు.
ఎన్నికలు, పార్టీ విస్తరణ, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం.. ఈ మూడు అంశాలే ఎజెండాగా ఇవాళ్టి నుంచి బీజేపీ ప్రత్యేక టాస్క్ చేపడుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో కీలక తీర్మానాలు చేయనున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు కార్యవర్గ సమావేశంలోనే రోడ్‌మ్యాప్ ప్రతిపాదించనున్నారు. బూత్‌లలో గెలుపు- పార్లమెంట్‌లో గెలుపు నినాదంతో దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యచరణ రూపొందిస్తారు.
నగరానికి జాతీయ నాయకుల రాకతో తెలంగాణ నేతల్లో ఫుల్ జోష్ నెలకొంది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని విజయశాంతి పేర్కొన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణపై ప్రత్యేకంగా చర్చిస్తామని అంటున్నారు ఆ పార్టీ నేత విజయశాంతి. ఈ సమావేశాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పు వస్తుందని చెబుతున్నారు.
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా మధ్యాహ్నం నగరానికి రానున్నారు. వీఐపీలు నగరానికొస్తుండంతో భారీగా బలగాలను మోహరించారు. చీమ చిటుక్కుమన్నా పసిగట్టేలా భద్రత ఏర్పాటుచేశారు. శత్రు దుర్భేద్యంగా మారాయి HICC పరిసరాలు. HICC, బేగంపేట, రాజ్‌భవన్ మార్గాల్లో 4వేల మందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.
భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద భారీ భద్రత..
హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. చార్మినార్ పరిసరాల్లో సాయుధ పోలీసులను మోహరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరానికొస్తున్న వీఐపీలు,,ఇవాళ, రేపు అమ్మవారిని దర్శించుకోనున్నారు. దీంతో చార్మినార్ చుట్టూ పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు.
విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు..
రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ విజయసంకల్ప సభ జరగనుంది. భారీ బహిరంగ సభ కోసం పది జర్మన్ టెంట్లు వేశారు. రెండు లక్షల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లుచేశారు. వాహనాల పార్కింగ్ కోసం నాలుగు మైదానాలను కేటాయించారు. ఈ సభకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ జన సమీకరణకు చర్యలు చేపట్టారు నేతలు. ప్రధాని సభకు వచ్చేందుకు ప్రచారం రథం ఏర్పాటుచేశారు.
భద్రతా వలయంలో..
హైదరాబాద్‌కు వీవీఐపీల తాకిడి పెరిగింది. హెచ్‌ఐసీసీలో కార్యవర్గ సమావేశాలకొస్తున్న నేతలు..నోవాటెల్, వెస్టిన్ హోటల్స్‌లో బస చేయనున్నారు. అమిత్‌షా, రాజ్‌నాథ్, యోగి రోడ్డుమార్గంలో రానున్నారు. అగ్రనేతల రాకతో భద్రతావలయంలో ఉన్నాయి నోవాటెల్ పరిసరాలు. తెలంగాణ పోలీసులతో SPG కో ఆర్డినేషన్ చేసుకుంటూ ప్రధాని మోదీ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తోంది. నోవాటెల్ చుట్టూ స్పెషల్ ఫోర్స్.. పైన స్నైపర్స్ పహారా కాస్తున్నాయి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి