PM Modi: శనివారం హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. హైదరాబాద్‌లో నాలుగు అంచెల్లో భద్రతా ఏర్పాట్లు..
BJP National Executive Meet: ప్రధాని నరేంద్రమోదీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. జులై 2 నుంచి నాలుగో తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.
PM Modi Hyderabad Visit: ప్రధాని మోదీ(PM Modi) తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం హైదరాబాద్‌కు చేరుకుంటారు ప్రధాని మోదీ. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. శనివారం, ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగే సమావేశాలకు ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న మోదీకి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో 28 నుంచి 30 గంటల పాటు గడపనున్న ప్రధాని పర్యటనను.. విజయవంతంగా పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.
ప్రధాని మోదీ టైం షెడ్యూల్ ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్‌ఐసీసీ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. హెచ్‌ఐసీసీకి 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్, నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. 4 రోజుల పాటు పూర్తిగా పోలీసుల నిఘాలో హెచ్‌ఐసీసీ ఉండనుంది. కేవలం బీజేపీ అనుమతించిన ప్రతినిధులకే హెచ్ఐసీసీలోకి అనుమతించనున్నారు. అనుమతించిన ప్రాంతంలోనే వాహనాలు నిలపాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్లో జులై 2న మధ్యాహ్నం 2.55కి గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ ల్యాండ్ అవుతారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.20 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకోనున్నారు. సాయంతం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ.
ఇక జులై 3న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమావేశాల్లో పాల్గొననున్నారు ప్రధాని. సాయంత్రం 6.30 పరేడ్ గ్రౌండ్స్ సభకు చేరుకుంటారు. 6.30 నుంచి 7.30 వరకు సభలో ఉంటారు. అక్కడ ప్రజలు, కార్యకర్తలనుద్దేధించి ప్రసంగించనున్నారు. అదేరోజు రాత్రి నోవాటెల్‌లో బసచేస్తారు.
ఇక జులై 4న ఉదయం 9.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు.
ఎల్లుండి రాత్రి రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బస
ఈ నెల 3న రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ సభ తర్వాత రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేయనున్నట్లు నగర కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రాజ్‌భవన్‌లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. హెచ్‌ఐసీసీ, బేగంపేట, రాజ్‌భవన్ మార్గాల్లో 4వేల మంది, పేరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జడ్, జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న నాయకులు వస్తోన్న నేపథ్యంలో భారీ భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.
బీజేపీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్‌లో భద్రత ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్ లో లక్షమంది వరకు కూర్చునే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమావేశాలకు హాజరవుతున్నారు. కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించినట్లుగా వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా ఉంటారని తెలిపారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్త్ లో ఉంటారన్నారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టర్ ఇంఛార్జ్ లుగా నియమించామన్నారు.