AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Executive Meet: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు.. తీర్మానాలు ఇవే..!

ప్రధాని మోడీ బహిరంగ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ఈ సమావేశాలను బీజేపీ నిర్వహిస్తోంది. అయితే రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో 2024 లోక్‌సభ ఎన్నికలతోపాటు.. బీజేపీ ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోబోతోందనేది ఇప్పడు హాట్​టాపిక్‌గా మారింది.

BJP Executive Meet: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు.. తీర్మానాలు ఇవే..!
Telangana Bjp
Shaik Madar Saheb
|

Updated on: Jul 02, 2022 | 7:23 AM

Share

BJP National Executive Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తోంది కాషాయ పార్టీ. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాల్లో కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ గడ్డపై జరుగుతున్న సమావేశాల్లో పక్కా తెలంగాణ ఫ్లేవర్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్థానిక నేతలు. ప్రధాని మోడీ బహిరంగ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ఈ సమావేశాలను బీజేపీ నిర్వహిస్తోంది. అయితే రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో 2024 లోక్‌సభ ఎన్నికలతోపాటు.. బీజేపీ ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోబోతోందనేది ఇప్పడు హాట్​టాపిక్‌గా మారింది. ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలుత ప్రధాని మోడీ ఎనమిదేండ్ల పాలనలో ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి వచ్చే ఎన్నికలకు సిద్ధమవ్వాలని కాషాయ దళం భావించింది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ ​వైఫల్యాలను కూడా ఇంటింటికి తీసుకెళ్లేలా కరపత్రాలు వేయించాలని వ్యూహరచన చేసింది.

అయితే అనూహ్యంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్ష పార్టీలు, అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చర్చలు జరిపి తీర్మానం ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్​ పథకం వల్ల దేశమంతా అట్టుడికింది. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో ఆందోళనకారులు సికింద్రాబాద్​స్టేషన్​లో పలు రైళ్లను దగ్ధం చేశారు. ఆందోళనకారులను గుర్తించి వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా బీజేపీకి యువతే బలం. అలాంటిది వారు కూడా ఈ పథకాన్ని తప్పుపట్టడం తో వారి కోపాన్ని తగ్గించాలని కమలనాథులు చూస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలతో యువతను దూరం చేసుకునేందుకు కాషాయదళం సిద్ధంగా లేదు. అందుకే అగ్నిపథ్​విషయంలో యువతను చల్లార్చేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ సమావేశాల్లో చర్చించి బీజేపీ తీర్మానాలు చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వేర్వేరు తీర్మానాలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు అంశాలపై కేంద్ర తీర్మానాల కమిటీ కసరత్తు చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏయే అంశాలపై తీర్మానాలు చేయబోతున్నారనే అంశాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కార్యదర్శులతో చర్చించారు. హెచ్ఐసీసీలో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీలతో నడ్డా సమావేశం నిర్వహించారు. ఎనిమిదేండ్ల మోడీ పాలనలో ప్రజల కోసం తీసుకొచ్చిన పీఎం గరీబ్ రథ్​ కల్యాణ్​యోజన, దేశ ప్రజలకు ఉచితంగా కొవిడ్​ టీకా, ఆయుష్మాన్​భారత్, మెడికల్​కాలేజీలు, రైతు సంక్షేమం, జాతీయ భద్రతా విధానం, ఆర్థిక సంస్కరణలు, జాతీయ రహదారుల నిర్మాణం వంటి పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చలు జరపనున్నారు. మిగులు బడ్జెట్​ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించడం, విద్యార్థులకు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవటం, అన్నదాతలను పెడుతున్న ఇబ్బందులపై, దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచకుండా అడ్డుకోవడాన్ని, దళిత బంధు, మూడెకరాల భూమి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇక జూలై 4న నేషనల్​ఆర్గనైజింగ్​సెక్రటరీ బీఎల్ సంతోష్ నేతృత్వంలో పార్టీ కోసం పనిచేసే ఫుల్​టైం కార్యకర్తలతో భేటీ నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీల మార్పు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ సమావేశాల్లో పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..