Hyderabad: ఫామ్‌హౌస్, రిసార్ట్స్ యజమానులకు పోలీసుల వార్నింగ్
ఫామ్‌హౌస్‌ల యజమానులు బీకేర్‌ఫుల్.. ఫ్యామిలీ ఫంక్షన్ల పేరుతో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లిక్కర్ పార్టీలు నిర్వహించినా అనుమతి తప్పనిసరి అని షరతులు విధిస్తున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ... .

హైదరాబాద్ శివారు ప్రాంతాలు రేవ్, ముజ్రా పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఫ్యామిలీ ఫంక్షన్ పేరుతో ఫామ్ హౌజ్‌లను బుక్ చేసుకొని విదేశీ మద్యం, గంజాయి, డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫామ్‌హౌస్, రిసార్ట్స్ యజమానులకు పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లిక్కర్ పార్టీలకు ఎక్సైజ్ అనుమతి తీసుకోవాలని సూచించారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి.
హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలోనే 50 ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఫామ్‌హౌస్‌ల యజమానులతో సమావేశమైన మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి పలు సూచనలు చేశారు. ఫామ్‌హౌస్, రిసార్ట్స్‌లో మొత్తం ఏరియా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని ఫామ్‌హౌస్, రిసార్ట్స్ యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.




