Hyderabad: వివాదాస్పద సీఐ నాగేశ్వరరావుపై వేటు.. ఉద్యోగం నుంచి తొలిగించిన హైదరాబాద్ సీపీ.. అత్యాచార కేసులో..
శాఖాపరమైన విచారణకు చాలా సమయం పడుతుందని, ఈ క్రమంలో బాధితులు, సాక్షులను నాగేశ్వరరావు తీవ్రంగా ప్రభావితం చేసే ముప్పు ఉందంటూ కోరట్ల నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగించడమే సరైన శిక్ష అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వెల్లడించారు.

ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న వివాదాస్పద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోరట్ల నాగేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పోలీసు నియామక నిబంధనలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (b) ద్వారా దఖలుపడిన అధికారంతో ఎటువంటి విచారణ లేకుండా నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
కోరట్ల నాగేశ్వరరావుపై వచ్చిన అభియోగాలపై శాఖాపరమైన విచారణ నిర్వహించడం ఆచరణపరంగా సాధ్యం కాదని పోలీసు కమిషనర్ అభిప్రాయపడ్డారు. విచారణ నిర్వహిస్తే సాక్షులు, బాధితులను కోరట్ల నాగేశ్వరరావు బెదిరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ఆయనది నేరప్రవృత్తిగల మనస్తత్వమనే విషయం అనేక సందర్భాల్లో రుజువైందని వెల్లడించారు.




అంతే కాదు శాఖాపరమైన విచారణకు చాలా సమయం పడుతుందని, ఈ క్రమంలో బాధితులు, సాక్షులను నాగేశ్వరరావు తీవ్రంగా ప్రభావితం చేసే ముప్పు ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో విచారణ నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి కోరట్ల నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగించడమే సరైన శిక్ష అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వెల్లడించారు.
