Cyber Crime Alert: ఎవరైనా క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులును చెల్లిస్తామంటున్నారా..? అయితే జాగ్రత్త
Cyber Crime Alert: ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగలో అయితే కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు..
Cyber Crime Alert: ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగలో అయితే కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పటికే సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకుని కేసులు నమోదు చేసిన దాఖలాలున్నాయి. అటు బ్యాంకు సిబ్బంది, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే నిలువునా మోసపోతారని సూచిస్తున్నారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశారు. మీ ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదా మీ ఇంటిని అమ్మకానికి పెట్టడం లాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో ఎవరైనా కొంత డబ్బును అడ్వాన్స్‌గా క్యూఆర్ కోడ్ (QR-Code) ద్వారా చెల్లిస్తామంటే అది సైబర్ నేరగాళ్ల పనేనని గమనించాలని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ముందు డబ్బులను రిసీవ్ చేసుకుంటున్నారా..? లేక మీకు పంపిస్తున్నారా..? అనే విషయాన్ని తప్పకుండా గమనించాలని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అలాగే మీకు ఎవరైనా ఏదైనా లింక్‌లు పంపిస్తూ దానిని క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయని, లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉందంటూ వస్తున్న లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి లింక్‌లను ఓపెన్ చేసినట్లయితే మీ వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్లకు తెలిసిపోవడమే కాకుండా మీ ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం కావడం ఖాయమంటున్నారు. అందుకే ఎవరైనా లింక్‌లను పంపిస్తూ ఓపెన్ చేయాలన్నా, ఓటీపీలు, ఇతర వివరాలు చెప్పాలంటూ ఫోన్‌లు చేసిన స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు.