Hyderabad Book Fair 2025: పుస్తక ప్రియులకు అలర్ట్.. నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ షురూ! టైమింగ్స్ ఇవే! విద్యార్ధులకు ఫ్రీ ఎంట్రీ
Hyderabad Book Fair 2025 timings: హైదరాబాద్ 38వ బుక్‌ఫెయిర్‌కు ఎన్టీఆర్ స్టేడియం ముస్తాబైంది. ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు ఈ పుస్తక మహోత్సవం జరగనుంది. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది..

హైదరాబాద్, డిసెంబర్ 19: హైదరాబాద్ 38వ బుక్‌ఫెయిర్‌కు ఎన్టీఆర్ స్టేడియం ముస్తాబైంది. ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు ఈ పుస్తక మహోత్సవం జరగనుంది. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది. విద్యార్థులకు ప్రవేశం పూర్తిగా ఉచితం. కేజీ నుంచి పీజీ స్థాయి విద్యార్ధుల వరకు ఉచిత ప్రవేశ సదుపాయం కల్పించినట్లు బుక్‌ఫెయిర్ కమిటీ కార్యదర్శి వాసు తెలిపారు. మిగతా సందర్శకులకు ఎంట్రీ ఫీజు రూ.10 ఉంటుంది. ఈసారి మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలు కూడా ఈ 11 రోజుల పాటు చోటు చేసుకోనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొననున్నా యి. శుక్రవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 38వ బుక్‌ఫెయిర్ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి వాసు వంటి ప్రముఖులు హాజరుకానున్నారు.
కాగా ప్రతీయేట ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ఈ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన వస్తుంది. యేటా లక్షలాది మంది పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గత ఏడాది సుమారు 12 లక్షల మంది సందర్శకులు పుస్తక ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల మందికి పైగా సందర్శించే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కవి అందెశ్రీ ప్రాంగణంగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సాంస్కృతిక వేదికకు అనిశెట్టి రజిత పేరు, ఈ ఏడాది మరణించిన జర్నలిస్ట్ స్వేచ్ఛ పేరిట మీడియా స్టాల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. యేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో గత ఏడాది 350 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రచురణ సంస్థల నుంచి విశేష స్పందన రావడంతో ఈసారి స్టాళ్ల సంఖ్యను 365కు పెంచారు. ఇందులో మీడియాకు 22 స్టాళ్లు, రచయితలకు 9 స్టాళ్లు ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








