ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే..
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. కొద్దిరోజుల క్రితమే డిగ్రీ పట్టా అందుకుని కన్నవారి కలలు నిజం చేయాలనుకున్నాడు. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి.. తను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ఆ తెలుగు యువకుడు. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలను పణంగా పెట్టి ముగ్గురు స్నేహితులను కాపాడి, చివరకు తాను మృత్యువాత పడిన విషాద ఘటన కలచివేసింది. కొద్ది రోజుల క్రితమే యూనివర్సిటీ విద్యను పూర్తి చేసుకున్న 22 ఏళ్ల అనురూప్ రెడ్డి ధైర్యసాహసాలు అందరినీ కదిలిస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న టోలెడో బెండ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అనురూప్ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో ముగ్గురు స్నేహితులు నీటిలో మునిగిపోతూ ప్రమాదంలో చిక్కుకోవడంతో ఈతలో నైపుణ్యం కలిగిన అనురూప్ వెంటనే నీటిలోకి దూకాడు. ప్రాణాలకు తెగించి ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చాడు. అయితే వారిని కాపాడిన అనంతరం తిరిగి బయటకు వచ్చే క్రమంలో నీటిలో ఉన్న ఫిషింగ్ నెట్‌లో చిక్కుకున్నాడు. అదే సమయంలో బలమైన అలలు అతడిని లోతులోకి లాక్కెళ్లాయి. దీంతో అనురూప్ కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
సుమారు 20 అడుగుల లోతులో అతడి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనురూప్ ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచి పట్టభద్రుడయ్యాడు. అతని సోదరుడు అశ్రిత్ కొడూరు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అంతర్జాతీయ రవాణా, చట్టపరమైన ప్రక్రియలు, ఇతర ఖర్చులు భారీగా ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. “మా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. అనురూప్ మృతదేహాన్ని అమెరికా నుంచి భారత్‌కు తీసుకురావడం ప్రస్తుతం మా ప్రధాన బాధ్యత. ఇందుకు భారీ వ్యయం అవుతోంది” అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్పందించిన సబైన్ పారిష్ షెరీఫ్ ఆరోన్ మిచెల్.. డెంటన్ నగరానికి చెందిన 22 ఏళ్ల యువకుడు నీటిలో మునిగి మరణించినట్లు ధృవీకరించారు. గాలింపు, సహాయక చర్యల్లో పలు అత్యవసర సేవా సంస్థలు పాల్గొన్నాయి. మరోవైపు, హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ కూడా అనురూప్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది. కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. తెలుగు యువకుడి ఈ త్యాగం సోషల్ మీడియాలో భావోద్వేగ స్పందనలకు దారితీస్తోంది. ముగ్గురి ప్రాణాలను కాపాడి తన ప్రాణాన్ని అర్పించిన అనురూప్‌ను నిజమైన హీరోగా పలువురు కొనియాడుతున్నారు.
