Hyderabad: ముసలోడేగానీ మహానుబావుడు సామీ.. కోట్ల ఆస్తులపై కన్నేసిన కేటుగాడు అరెస్ట్!
హైదరాబాద్‌లో నకిలీ పత్రాలతో భూములపై హక్కులు ఉన్నట్లు చూపిస్తూ ఆస్తి యజమానులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్‌ను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ హిబానామా పత్రాలు, ఫోర్జరీ చేసిన స్టాంప్ పేపర్లతో భూ వివాదాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. బెంగళూరులో దాక్కున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు..

హైదరాబాద్: భూఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టి, బెదిరింపులు, అక్రమ వసూళ్లతో ఆస్తి యజమానులను వేధిస్తున్న ఓ పాత నేరస్థుడిని చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు దశాబ్దకాలంగా భూములపై వివాదాలు సృష్టిస్తూ కోట్ల రూపాయల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ (61)ను బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, న్యూ మలక్‌పేట్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ నజముద్దీన్ షాకీర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ వారసత్వంగా వచ్చిన భూమిలో 2025లో నిర్మాణ పనులు ప్రారంభించిన సమయంలో ఖుద్దూస్ ఆ స్థలంపై హక్కులు ఉన్నాయని పేర్కొంటూ నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి.
దర్యాప్తులో ఫోర్జరీ చేసిన స్టాంప్ పేపర్లు, నకిలీ హిబానామా పత్రాలను ఉపయోగించి కోర్టుల్లో సివిల్ కేసులు, రిట్ పిటిషన్లు దాఖలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు యజమానులను కోర్టుల చుట్టూ తిప్పుతూ మానసిక ఒత్తిడికి గురిచేయడం అతని ప్రధాన వ్యూహంగా వెల్లడైంది. అంతేకాకుండా, తన అనుచరుల ద్వారా ఫిర్యాదుదారుని సంప్రదించి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు, డబ్బులు చెల్లించకపోతే తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తామని, హత్య కేసుల్లో నిందితులుగా చూపిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఒకే పద్ధతిలో మోసాలు
స్థానిక పత్రికల్లో అమ్మకానికి వచ్చిన భూములు, కొత్తగా నిర్మాణాలు జరుగుతున్న స్థలాలను ఖుద్దూస్ ప్రత్యేకంగా గుర్తించేవాడని దర్యాప్తులో తేలింది. అనంతరం ఒకే ఫోర్జరీ డాక్యుమెంట్ నంబర్‌ను ఉపయోగించి నకిలీ హిబానామా పత్రాలు తయారు చేసి ఆస్తులపై హక్కులు ఉన్నట్లు చూపించేవాడని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టుల్లో కేసులు వేసి యజమానులపై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేయడం అతని నేరపద్ధతిగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ విధంగా పలువురు ఆస్తి యజమానుల నుంచి సుమారు రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బెంగళూరులో అరెస్ట్
కేసు తీవ్రత పెరగడంతో ఖుద్దూస్ హైదరాబాద్‌ను విడిచి బెంగళూరుకు పారిపోయినట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. గంగానగర్ ప్రాంతంలోని తన కుమారుడి నివాసంలో దాక్కున్న ఖుద్దూస్‌ను జూన్ 22న అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. నిందితుడిపై 2014 నుంచే మోసం, ఫోర్జరీ, బెదిరింపులు, అక్రమ వసూళ్లు, భూ ఆక్రమణలకు సంబంధించిన పలు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. భూములకు సంబంధించిన వివాదాల్లో నకిలీ పత్రాలు, బెదిరింపులు లేదా అక్రమ డబ్బు డిమాండ్లు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని చాదర్‌ఘాట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసగాళ్ల గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.




