12 ఏళ్ల ఎదురుచూపుకు ఎట్టకేలకు మోక్షం: ‘మమ్మల్నీ పంపించండి’ అంటూ.. AP ఉద్యోగుల విజ్ఞప్తి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన అనంతరం పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలో పనిచేస్తున్న 891 మంది ఉద్యోగులు తెలంగాణకు శాశ్వత బదిలీ కోరుతూ సుముఖత వ్యక్తం చేయగా, వారి జాబితాను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు పంపించింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపితే దాదాపు 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రస్థాయి కార్యాలయాల ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది..

హైదరాబాద్, జూన్ 22: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీల ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. రెండు రాష్ట్రాల విభజన తర్వాత విభజన చట్టం ప్రకారం శాశ్వత ప్రాతిపదికన ఏపీలో పని చేస్తున్న 891 మంది ఉద్యోగులు తెలంగాణకు శాశ్వత ప్రాతిపదికన వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీలో పని చేస్తున్న 891 మంది ఉద్యోగుల జాబితాను ఏపీ ప్రభుత్వం తాజాగా తెలంగాణకు పంపింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏపీ సీఎస్ లేఖ రాశారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈ జాబితాను త్వరగా పరిశీలించి, అభిప్రాయాన్ని, అంగీకారం తెలియజేయాలని అందులో తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ విజ్ఞప్తి చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఉద్యోగుల శాశ్వత బదిలీల ప్రక్రియ సుఖాంతం అవుతుంది. గతంలో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లడానికి మొత్తం 1943 మంది ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఇందులో ప్రస్తుతం 891మంది ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.
కాగా 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణకు ఉద్యోగుల్ని విభజించిన సంగతి తెలిసిందే. ఈ కేటాయింపుల్లో తెలంగాణ జిల్లాలకు చెందినవారు కొందరు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. దీంతో 2014 నుంచి వారు అక్కడే కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. పండుగలు, కుటుంబ అకేషన్స్, సెలవులు వంటి సందర్భాల్లో ఇంటికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని, తమను సొంత రాష్ట్రంలో పని చేసే అవకాశం కల్పించాలని అప్పటి నుంచి ఈ ఉద్యోగులంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందులో కొంతమంది ఉద్యోగులు ప్రతి వారం శుక్రవారం సాయంత్రం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి.. మళ్లీ సోమవారం ఉదయం ఏపీకి చేరుకుంటున్నారు. గత 12 ఏళ్లుగా ఈ సమస్య ఇలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ కీలక ముందడుగు వేసింది. దీనితోపాటు ఏపీ సర్కార్ మరో కీలక ప్రకటన కూడా చేసింది. రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 5 రోజుల పనిదినాలను మరో ఏడాది పాటూ పొడిగిస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగుల శాశ్వత బదిలీకి తెలంగాణ సర్కార్ కూడా గ్రీన్‌సిగ్నల్ వస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది.
‘మమ్మల్నీ పంపించరూ..?’ తెలంగాణలోని ఏపీ ఉద్యోగుల విజ్ఞప్తి
అలాగే విభజన సమయంలో ఏపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొందరు తెలంగాణలో ఉండిపోయారు. వీళ్లు కూడా మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత బదిలీ చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ రెండు నిర్ణయాలపై తెలంగాణ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి..!




