AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

94 ఏళ్ల వృద్ధురాలి మనసు మళ్లీ మాతృభూమి వైపు.. భారత పౌరసత్వం కోసం మహాలక్ష్మమ్మ వినతి

బాపట్ల జిల్లా చింతగుంపల గ్రామానికి చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వం పొందినప్పటికీ, జీవిత చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. సాంకేతిక కారణాలతో తొలి దరఖాస్తు తిరస్కరణకు గురికాగా, తాజాగా మరోసారి దరఖాస్తు చేసి కలెక్టర్ ఎదుట ప్రమాణం చేశారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆమెకు భారత పౌరసత్వం దక్కే అవకాశం ఉంది.

94 ఏళ్ల వృద్ధురాలి మనసు మళ్లీ మాతృభూమి వైపు.. భారత పౌరసత్వం కోసం మహాలక్ష్మమ్మ వినతి
Mahalakshmamma
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 24, 2026 | 1:03 PM

Share

జీవితంలో ఎన్నో మలుపులు తిరిగినా చివరికి పుట్టిన నేలే తనకు శాశ్వత నిలయమని భావించిన 94 ఏళ్ల వృద్ధురాలు ఇప్పుడు భారత పౌరసత్వం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన మహాలక్ష్మమ్మ తన జీవిత చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు.

మహాలక్ష్మమ్మ 1993లో భర్త మరణానంతరం తన కుమారుడి వద్ద ఉండేందుకు అమెరికాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడటంతో 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు అమెరికాలో నివసించిన ఆమె 2018లో తిరిగి స్వదేశానికి వచ్చారు. ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు బుచ్చయ్య సమీపంలో ఉంటూ, స్వగ్రామమైన చింతగుంపలలోనే నివాసం ఉంటున్నారు.

గత ఎనిమిదేళ్లుగా భారత్‌లోనే నివసిస్తున్న మహాలక్ష్మమ్మకు ఇక అమెరికాకు వెళ్లాలనే ఉద్దేశం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మిగిలిన జీవితాన్ని పుట్టిన గడ్డపైనే గడపాలని, చివరి శ్వాస కూడా భారతదేశంలోనే విడవాలని ఆమె కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత పౌరసత్వం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అయితే తొలి దరఖాస్తు సాంకేతిక కారణాలతో రిజెక్ట్ అయింది. అనంతరం మరోసారి దరఖాస్తు చేసుకున్న ఆమె, పౌరసత్వ ప్రక్రియలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట్ మురళి వినోద్ కుమార్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దేశ చట్టాలను పాటిస్తూ నడుచుకుంటానని కలెక్టర్ సమక్షంలో ఆమె ప్రమాణం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే మహాలక్ష్మమ్మకు భారత పౌరసత్వం లభించే అవకాశం ఉంది.

ఉద్యోగాలు, మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న ఈ రోజుల్లో, 94 ఏళ్ల వృద్ధురాలు స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని కోరుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుట్టిన నేలపై ఉన్న మమకారం, జీవిత చరమాంకంలో స్వదేశానికే చేరాలనే ఆమె ఆకాంక్ష పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Follow Us