Andhra Pradesh: అద్దిరిపోయే శుభవార్త.. ఆ జిల్లాలో తొలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్..! రూ.100కోట్ల పెట్టుబడి..
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదిరిన ఒప్పందం నెరవేరుస్తూ ఏపీ ఈడీబీ, యూఏఈ ఫుడ్ క్లస్టర్ మధ్య కీలక అవగాహనా ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు నాయుడు, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీని ద్వారా మామిడి, అరటి, కోకో వంటి ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతులు, విదేశీ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారనుంది. తొలి అడుగుగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్..

ఈ ఏడాది జనవరిలో దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న మరో కీలక ఒప్పందం ఆరు నెలల్లోనే సాకారమైంది. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB) మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఫుడ్ క్లస్టర్ మధ్య చారిత్రాత్మక అవగాహనా ఒప్పందం (MoU) కుదిరింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి.
ఈ ఒప్పందం ద్వారా ఏపీలో పండే మామిడి, అరటి, కోకో వంటి వివిధ రకాల ఉద్యాన పంటలకు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ డిమాండ్ ఏర్పడనుంది. ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుతో పాటు విలువ జోడించిన ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు యూఏఈ సహకరిస్తుంది. ఒప్పందంలో భాగంగా యూఏఈకి చెందిన ప్రముఖ ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రూ.100 కోట్ల పెట్టుబడితో అధునాతన ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ తయారయ్యే ప్రపంచ శ్రేణి ఉత్పత్తులు దాదాపు 25 దేశాలకు ఎగుమతి కానున్నాయి.
సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడుల వేగాన్ని మరింత పెంచేలా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. రూ.1 లక్ష కోట్ల అంచనాతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, రిలయన్స్ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే లభిస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి రావడం గర్వకారణమని, ఆగస్టు 1 నుండి అందుబాటులోకి రానున్న మరో అంతర్జాతీయ విమానాశ్రయం లాజిస్టిక్స్ రంగానికి మరింత బలాన్నిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
కృష్ణా-గోదావరి డెల్టా నీటి వనరులు, 200కు పైగా ఉద్యాన క్లస్టర్లు, బలమైన రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉన్న ఏపీలో క్వాంటం స్పీడ్‌తో లభించే అవకాశాలను యూఏఈ పారిశ్రామికవేత్తలు అందుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ రైతుల ఆదాయం పెరగడమే కాకుండా వేలాదిమంది యువతకు స్థానికంగానే ఉపాధి లభించనుంది.




