AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో కీలక భేటీ..

ఏపీ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఆగస్టు 1న జరగనున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధానిని స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో కీలక భేటీ..
Ap Cm Chandrababu Naidu Delhi Tour
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 8:29 PM

Share

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు సహా పలు పెండింగ్ అంశాలపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన అంశం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత వేగంగా నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు స్వయంగా కలసి ఆహ్వానించనున్నారు. ఉత్తరాంధ్ర ఆర్థిక, పర్యాటక రూపురేఖలను మార్చేసే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది.

వరుసగా కేంద్రమంత్రులతో భేటీలు

ప్రధాని మోదీతో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. హోమంత్రి అమిత్ షాతో సమావేశమై విభజన హామీల అమలు, నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉంది. పియూష్ గోయల్‌తో సమావేశమై ఏపీకి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణపై విజ్ఞప్తులు సమర్పిస్తారు. మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయి అమరావతి రాజధాని నగర నిర్మాణానికి సంబంధించిన నిధులు, కేంద్ర సాయంపై చర్చించనున్నారు. సీఆర్ పాటిల్‌తో సమావేశమై జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిధులు, పనుల పురోగతి, ఏపీలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.

పర్యటన షెడ్యూల్ వివరాలు:

బుధవారం ఉదయం 7.30 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. రేపు రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు. గురువారం ఉదయం 10:20కి తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కీలకంగా మారడంతో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా, అభివృద్ధి పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow Us