Andhra Pradesh: ఏపీలో పింఛన్లు తీసుకుంటున్నవారికి అలర్ట్.. వచ్చే నెల నుంచి నేరుగా అకౌంట్లోకి.. ఇది చేస్తేనే..
ఏపీలో పించన్లు తీసుకునేవారికి బిగ్ అలర్ట్. నవంబర్ 1 నుండి కొత్త విధానం అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోగా.. ఏపీ ప్రభుత్వం కూడా అమలుకు సిద్దమైంది.

ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్. నవంబర్ 1వ నుండి కొత్త పంపిణీ విధానం అమల్లోకి రానుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుండగా.. రాష్ట్ర ప్రభుత్వం అందించే వాటాను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ విధానం నవంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకకురానున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం పింఛన్ దారులకు ఒక నిర్ణీత మొత్తంలో కొంత వాటా అందిస్తోంది. ఇప్పటివరకు ఈ కేంద్ర వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ వాటాతో కలిపి లబ్ధిదారులకు నేరుగా చేతికి అందించేవారు. ఈ పద్ధతిలో లబ్ధిదారులు ఒకేసారి పూర్తి మొత్తాన్ని అందుకునేవారు.
అయితే కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఈ నిబంధన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పింఛన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం.. రాష్ట్ర వాటాను మాత్రమే చేతికి అందిస్తామని, కేంద్ర వాటా లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ అవుతుందని సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ కూడా తెలిపారు. ఏపీలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా పింఛన్లను అందిస్తుండగా.. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం స్కీమ్‌ను కూడా ఆ స్కీమ్‌తో అనుసంధానించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4 రూపాయల పింఛన్ అందిస్తుండగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.3800, కేంద్ర వాటా రూ.200 ఉంది.
దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి ప్రతి నెల రూ.6 వేలు అందిస్తుండగా.. ఇందులో రాష్ట్ర వాటా రూ.5,700, కేంద్ర వాటా రూ.300గా ఉంది. ఈ మొత్తం స్వర్ణ గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అందించేవారు. ఇక నుంచి కేంద్ర వాటా నేరుగా లబ్దిదారుడు బ్యాంక్ అకంట్లో పడనుంది. పింఛన్ డబ్బులు అకౌంట్లో పడాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా తమ బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ అనుసంధానం లేకపోతే కేంద్ర వాటా పింఛన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావు. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు సూచిస్తున్నాయి. ఈ చర్య పంపిణీలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందని, మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
