AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకప్! మస్క్‌తో  బంధంపై  షివాన్ జిలిస్ సంచలన పోస్ట్

టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న షివాన్ జిలిస్ తాజాగా తామిద్దరం విడిపోయామని వెల్లడించారు. అయితే ఈ బ్రేకప్ తనకు ఊహించని విధంగా, ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే జరిగిందని ఆమె చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బ్రేకప్! మస్క్‌తో  బంధంపై  షివాన్ జిలిస్ సంచలన పోస్ట్
Shivon Zilis Says Elon Musk Ended Their Relationship Abruptly
Sharada V
|

Updated on: Oct 03, 2026 | 11:59 PM

Share

అక్టోబర్ 2న సోషల్ మీడియాలో షివాన్ జిలిస్ చేసిన ఓ సుదీర్ఘ పోస్టు ఈ విషయాన్ని బయటపెట్టింది. ‘ప్రేమలో ఉండటం నుంచి ఒక్క వారంలోనే విడిపోవాల్సి రావడం చాలా కష్టం. అదీ ఎలాంటి హెచ్చరిక లేకుండా. కానీ కొన్నిసార్లు జీవితం ఇలాగే ఉంటుంది’ అంటూ ఆమె భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మస్క్ ఆమెను ఎక్స్ లో అన్‌ఫాలో చేసారు. ఆ తర్వాతే షివాన్ చేసిన ఈ పోస్టు మరింత ఆసక్తిని రేకెత్తించింది.

కొద్ది రోజుల క్రితమే.. ‘లవ్ యూ’ మెసేజ్

అయితే షివాన్ షేర్ చేసిన మరో విషయం ఈ కథలో అసలు ట్విస్ట్‌గా మారింది. ఆమె ఎలాన్ మస్క్‌తో ఇటీవల జరిగిన చాట్‌ స్క్రీన్‌షాట్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 24న జరిగిన సంభాషణలో షివాన్..’నిన్ను బ్రేక్‌ఫాస్ట్‌లో కలవడం చాలా బాగుంది. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’ అని మెసేజ్ చేశారు. దానికి మస్క్.. ‘నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను’ అని సమాధానం ఇచ్చారు. అంతేకాదు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం గత వారం వైట్‌హౌస్‌లో జరిగిన స్టేట్ డిన్నర్‌కు ఆమెను ఆహ్వానించవచ్చని తనకు అప్పటివరకు తెలియదని మస్క్ ఆమెకు మెసేజ్ చేసారు. ఇంత సన్నిహితంగా మాట్లాడిన కొద్ది రోజులకే సంబంధం ముగిసిందని షివాన్ ప్రకటించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

‘న్యూ డే.. న్యూ లైఫ్’.. ముందే సంకేతమా?

సెప్టెంబర్ 27న షివాన్ చేసిన మరో సోషల్ మీడియా పోస్టు కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘New day, new life’ అంటూ ఆమె అప్పట్లో రాశారు. అప్పుడు ఆ మాటల వెనుక కారణం ఏమిటో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు బ్రేకప్ విషయం బయటకు రావడంతో.. వారి సంబంధంలో అప్పటికే ఏదో మార్పు వచ్చిందనే అంశం చర్చకు దారితీసింది.

మస్క్‌కు ‘సేఫ్ స్పేస్’గా ఉన్నామన్న షివాన్

మస్క్‌తో తన బంధాన్ని గుర్తుచేసుకుంటూ షివాన్ భావోద్వేగానికి గురయ్యారు. మస్క్ బాల్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, ఆయన తరచూ  ‘అంతర్గత సంఘర్షణతో బాధపడే వ్యక్తి’  అని రాసుకొచ్చారు. తాను,  పిల్లలు ఒక “సేఫ్ స్పేస్”గా ఉండేవారమని, ప్రపంచంతో పోరాడేందుకు వెళ్లే ముందు మస్క్ తన హృదయానికి, మనసుకు విశ్రాంతి తీసుకునే స్థలం తమ నివాసమే అని పోస్టులో తెలిపారు

‘లైఫ్ కంటే ఎక్కువగా ప్రేమించాను’

బ్రేకప్ తనకు ఎంతో బాధను మిగిల్చిందని చెప్పిన షివాన్.. మస్క్‌పై తనకు ప్రేమ తగ్గలేదనీ,  తను మస్క్‌ను ‘జీవితం కంటే ఎక్కువగా ప్రేమించాను’ అన్నారు. మస్క్ తనకు ఎంతో నేర్పించారని, తన జీవితానికి ఎంతో అర్థాన్ని ఇచ్చారనీ,   విడిపోవడం వల్ల చాలా నష్టం జరిగినట్లు అనిపిస్తోందని, అయితే మస్క్‌తో కలిసి తన జీవితంలోకి వచ్చిన నలుగురు పిల్లలు మాత్రం తనకు అందమైన వరమని షివాన్ అన్నారు. ‘నేను బాధపడుతున్నాను.. కానీ ఎలాన్‌పై నాకు ఎంతో శ్రద్ధ ఉంది.. ఆయన సంతోషంగా ఉండాలని ఎప్పటికీ కోరుకుంటాను’ అన్నారు. చివరగా మస్క్‌కు శుభాకాంక్షలు చెబుతూ.. ప్రపంచం గుర్తించడం అతను చేసుకున్న అదృష్టమని వ్యాఖ్యానించారు. అయితే ప్రేమగా మారిన బంధం బ్రేకప్‌కు దారి తీయడానికి కారణం ఏమిటి? అన్న  విషయాన్ని షివాన్ వెల్లడించలేదు.

మస్క్ నుంచి ఇంకా రాని స్పందన

బ్రేకప్ గురించి షివాన్ బహిరంగంగా మాట్లాడినప్పటికీ.. మస్క్ స్పందించలేదు. కొద్ది రోజుల క్రితం వరకు ఒకరినొకరు ప్రేమిస్తున్నామని మెసేజ్‌లు చేసుకున్న ఇద్దరి మధ్య.. అంతలోనే ఏం జరిగింది? ఇప్పుడిదే ప్రధాన ప్రశ్నగా మారింది. మస్క్ కు వేర్వేరు మహిళలతో 14 మంది పిల్లలు ఉన్నారన్న విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన షివోన్ జిలిస్ కెనడాలో జన్మించారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌లో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 2020లో మస్క్‌తో ఆమెకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత వారి వృత్తిపరమైన అనుబంధం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారింది. మస్క్, షివోన్ జిలిస్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో వీరికి కవలలు స్ట్రైడర్, అజూర్ పుట్టారు. ఆ తర్వాత 2024లో కుమార్తె ఆర్కేడియా, 2025లో కుమారుడు సెల్డన్ జన్మించారు.

Follow Us