ఆమెకు మరణశిక్ష.. ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా బతికింది!
ఆ రాత్రి ఓ ఖైదీకి మరణశిక్ష అమలు చేయడం కోసం అధికారులు అన్నీ సిద్ధం చేశారు. ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చారు కానీ ఊహించని విధంగా గంట గడిచినా ఆమె శ్వాస ఆగలేదు. చివరకు ప్రక్రియను ఆపేసి ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో క్రిస్టా పైక్ ప్రస్తుతం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయితే వద్దని వారించినా ప్రభుత్వం పట్టించుకోలేదనీ ఆమె తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

సెప్టెంబర్ 30 రాత్రి టెన్నెసీలోని రివర్‌బెండ్ ఇన్‌స్టిట్యూషన్‌లో క్రిస్టా పైక్‌కు ప్రాణాంతక ఇంజెక్షన్ పెంటోబార్బిటల్ రెండు డోసులు ఇచ్చారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఆమె ఊపిరితీసుకోవడం, కొన్ని సందర్భాల్లో పెద్దగా శ్వాస తీసుకుంటున్న శబ్దం వినిపించినట్లు సాక్షులు తెలిపారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో చివరకు ఎగ్జిక్యూషన్‌ను నిలిపివేసి ఆమెకు వైద్య సహాయం అందించారు. అయితే క్రిస్టా పైక్ న్యాయవాదులు కోర్టులో దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. మరణశిక్ష అమలులో ఉపయోగించిన ఐవీ లైన్లు సరిగ్గా రక్తనాళాల్లోకి వెళ్లలేదని అంటున్నారు. దాంతో పెంటోబార్బిటల్ కొంత భాగం రక్తప్రవాహంలోకి వెళ్లకుండా చుట్టుపక్కల కణజాలంలోకి వెళ్లి ఉండొచ్చని, పైక్ రెండు చేతులకూ తీవ్ర గాయాలు కావడం దాని వల్లే అని వాదిస్తున్నారు. ఆమె చేతులు వాచి, కాలినట్లు మారడం, బొబ్బలు రావడం వంటి సమస్యలు కనిపించాయని తెలిపారు.ఈ ఘటనలో మరో కీలక అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పైక్‌కు ఐవీ డ్రిప్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె న్యాయవాదులు మరణశిక్షకు ముందే టెన్నెసీ అధికారులను, కోర్టును హెచ్చరించారు. ఐవీ లైన్ల విషయంలో సమస్య ఏర్పడే అవకాశం ఉందనీ హెచ్చరించినా పట్టించుకోలేదనీ ఆరోపించారు. కాగా, ప్రస్తుతం ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన ఆధారాలను భద్రపరచాలని కోరుతూ అత్యవసర పిటిషన్ దాఖలు చేసారు.
ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం
మరణశిక్ష విఫలమైన తర్వాత క్రిస్టా పైక్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో శ్వాస తీసుకోవడానికి వెంటిలేటర్‌పై ఆధారపడుతున్నారు. ఆమె శరీరంలో పెంటోబార్బిటల్ ప్రభావాన్ని తగ్గించేందుకు, ఆమె ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. క్రిస్టా పైక్ కేసు మరో కారణంతోనూ ప్రత్యేకంగా నిలిచింది. టెన్నెసీలో రెండు శతాబ్దాల తర్వాత మరణశిక్షను ఎదుర్కొంటున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. 1995లో 19 ఏళ్ల స్నేహితురాలు కొలీన్ స్లెమ్మర్ హత్య కేసులో క్రిస్టా పైక్ దోషిగా తేలారు. అప్పటికి ఆమె వయసు 18 సంవత్సరాలు. 1996లో ఆమెకు మరణశిక్ష విధించారు.
ఈ ఘటన తర్వాత టెన్నెసీ గవర్నర్ బిల్ లీ ఇతర మరణశిక్షల అమలును నిలిపివేశారు. ప్రోటోకాల్ ప్రకారమే ప్రక్రియను నిర్వహించినా ఈసారి ఫలితం ఎందుకు భిన్నంగా వచ్చిందో తెలుసుకుంటామని స్వతంత్ర సమీక్షకు ఆదేశించారు. అయితే ఇది టెన్నెసీలో ఇటీవలి కాలంలో జరిగిన రెండో విఫల మరణశిక్ష కేసు. దీంతో ఎగ్జిక్యూషన్ ప్రక్రియ పైనా, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చే విధానంపైనా మరోసారి తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. రెండు డోసుల ప్రాణాంతక మందు ఇచ్చినా మరణించకుండా.. ఇప్పుడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ పోరాడుతోంది క్రిస్టా పైక్. ఆమె కేసు విషయంలో టెన్నెసీ అధికారులు తదుపరి ఏం నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి ప్రస్తుతం అందరిలోనూ ఉంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి!