మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం కిష్టంపేటలో కోతుల బెడద తీవ్రం కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అడవికి ఆనుకుని ఉండటంతో కోతులు తరచుగా ఊరిలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సర్పంచ్ రావుల తిరుమల తిరుపతి, ఉప సర్పంచ్ బండం మహేష్ వినూత్నంగా ఆలోచించారు. సుమారు పదిహేను వందల రూపాయల ఖర్చుతో చింపాంజీ గెటప్‌ను కొనుగోలు చేశారు. పంచాయతీ సిబ్బందికి ఆ గెటప్‌ను ధరింపజేసి, ఊరి వీధుల్లో తిప్పడం ప్రారంభించారు. ఈ చింపాంజీ గెటప్‌లో ఉన్న వారిని చూసిన కోతులు మొదట అయోమయానికి గురై, ఆ తర్వాత భయపడి గ్రామం నుండి పారిపోవడం మొదలుపెట్టాయి. మనుషుల కంటే వేగంగా, తెలివిగా ఉండే కోతులు, ఈ నకిలీ చింపాంజీల అసలు రహస్యం తెలుసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ వినూత్న ఆలోచన అద్భుతంగా పనిచేసి, కిష్టంపేట గ్రామస్తులకు కోతుల బెడద నుండి ఉపశమనం కలిగించింది. చాలా వరకు కోతులను గ్రామం నుండి తరిమేయడం జరిగింది.