Andhra Pradesh: ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు.. కరువుతో అన్నదాతలు ఆగమాగం..
ఆకాశం వైపు చూసి చూసి అన్నదాత కళ్లు కాయలు కాస్తున్నాయి.. వాన ముఖం చాటేసింది, చెరువుల్లో నీళ్లు ఇంకిపోయాయి, ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. కాగితాలపై గణాంకాలు ఎలా ఉన్నా, పల్లెల్లో పచ్చని పొలాలు నెర్రెలు బారుతుండటమే అసలైన కరువుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఏపీలోని 21 జిల్లాల్లో ఏకంగా 388 మండలాలను ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా ప్రకటించినా.. ఇంకా ఎన్నో గ్రామాల్లో అసలు నష్టాల లెక్కలు కాగితాలకెక్కడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

వాన తగ్గింది. చెరువులు నిండలేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గాయి. బోర్లు మరింత లోతుకు వెళ్లాయి. కరువు ఇప్పుడు కాగితంపై ఉన్న మాట కాదు. పల్లె పొలాల్లో కనిపిస్తున్న పరిస్థితి. ఏపీలో ఈసారి కరువు తీవ్రత లెక్కల్లోనే కనిపిస్తోంది. జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 53.4 శాతం వర్షపాతం లోటు నమోదైంది. దీంతో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 283 మండలాలు తీవ్ర కరువు, 105 మండలాలు సాధారణ కరువు పరిధిలో ఉన్నాయి. విత్తనం వేసే సమయంలో వాన లేదు. పంట నిలబడే సమయంలో నీటి భరోసా లేదు. సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 490.94 మిల్లీమీటర్లు కావాలి. కానీ పడింది 244.69 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే సగానికి దగ్గరగా వాన తగ్గిపోయింది. ప్రాజెక్టుల్లో గతేడాది నీళ్లు ఇప్పుడు ఎంత? అసలు నీటి లెక్క ప్రాజెక్టుల్లో కనిపిస్తోంది. సెప్టెంబర్ 25న ఏపీ ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో కలిపి 558 టీఎంసీల నీరు ఉంది. గతేడాది అదే తేదీకి 846 టీఎంసీలు ఉన్నాయి. అంటే దాదాపు 288 టీఎంసీల తేడా వచ్చింది. కృష్ణా బేసిన్‌లో గతేడాది 552 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 387 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు 165 టీఎంసీల నీరు తక్కువ. పెన్నా బేసిన్‌లో గతేడాది 239 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 108 టీఎంసీలకు పడిపోయింది. శ్రీశైలం, సాగర్ లెక్క ఏంటి? శ్రీశైలం పూర్తి...
