Andhra: వాయమ్మో.. చేప రెండు లచ్చలు ఏంది మావ.. అక్కడే ఉంది అసలు కిటుకు..
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన 25 కిలోల కచిడి చేప చిక్కింది. రెండు నెలల వేట విరామం అనంతరం లభించిన ఈ చేపను హార్బర్‌లో జరిగిన వేలంలో పాలకొల్లుకు చెందిన వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు.

ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన భారీ కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కి అందరి దృష్టిని ఆకర్షించింది. సుమారు రెండు నెలలపాటు చేపల వేట నిషేధం అనంతరం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు తొలి వేటలోనే ఈ అరుదైన చేప లభించడంతో ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 25 కిలోల బరువున్న మగ కచిడి చేప వలకు చిక్కడంతో అంతర్వేది హార్బర్ ఒక్కసారిగా సందడిగా మారింది. ఇంత భారీ పరిమాణంలో కచిడి చేప లభించడం చాలా అరుదని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, మత్స్యకారులు హార్బర్‌కు తరలివచ్చారు.
హార్బర్‌లో నిర్వహించిన వేలంలో ఈ అరుదైన చేపకు భారీ ధర పలికింది. పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి ఏకంగా రూ.2 లక్షలకు ఈ చేపను కొనుగోలు చేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్థానిక మత్స్యకారుల కథనం ప్రకారం, కచిడి చేప పొట్ట భాగంలోని ప్రత్యేక అవయవాలను ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అందుకే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చేపలకు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. అరుదుగా దొరికే ఈ చేపలకు భారీ ధర లభించడం కూడా అందుకేనని పేర్కొన్నారు.
రెండు నెలల వేట విరామం తర్వాత ఇలాంటి విలువైన చేప వలకు చిక్కడం శుభసూచకమని మత్స్యకారులు భావిస్తున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం అంతర్వేది పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. కచిడి చేపకు పలికిన రూ.2 లక్షల ధర స్థానికంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
