AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా రోబోలు, పెద్ద పెద్ద మిషన్లు, కోట్లు జీతాలు తీసుకునే ఇంజనీర్లు ఉండే ఒక అంతర్జాతీయ కార్ల కంపెనీలో.. ఏకంగా వంద గొర్రెలకు ఉద్యోగాలు ఇచ్చారు. కార్ల తయారీ ప్లాంట్‌లో గొర్రెలకు డ్యూటీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం.. అసలు ఈ జర్మన్ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ చేసిన ఆ ప్రయోగం ఏంటి? దానివల్ల కంపెనీకి ఏంటీ లాభం..? అనే విషయాలు తెలుసుకుందాం..

కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..?
Volkswagen Hire 100 Sheeps
Krishna S
|

Updated on: Jul 21, 2026 | 9:03 PM

Share

ప్రసిద్ధ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన ప్లాంట్‌లో ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆటోమొబైల్ కర్మాగారాల్లో అత్యాధునిక రోబోలు, వేల సంఖ్యలో ఇంజనీర్లు పనిచేస్తుంటారు. కానీ ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్‌లో మాత్రం ఏకంగా ఒక గొర్రెల మంద పనిచేస్తుంది. పోలాండ్‌లోని పోజ్నాన్ నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్‌లో గడ్డిని నియంత్రించడానికి ఏకంగా 100 గొర్రెలను సిబ్బందిగా నియమించింది ఆ సంస్థ. పోజ్నాన్‌లోని ఫోక్స్‌వ్యాగన్ కర్మాగారంలో 18.3 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఉంది. ఇందులో దాదాపు 31,000 కంటే ఎక్కువ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్ సాయంతో కర్మాగారానికి కావాల్సిన వార్షిక విద్యుత్ అవసరాలలో 25 శాతం సమకూరుతుంది. ఎండ ఎక్కువగా ఉండే రోజుల్లో ప్లాంట్ మొత్తం విద్యుత్ అవసరాలను ఇది ఒక్కటే తీరుస్తుంది. అయితే ఈ సోలార్ ప్యానెళ్ల కింద పెరిగే గడ్డిని కత్తిరించడం పెద్ద సవాలుగా మారింది. సాధారణ యంత్రాలతో గడ్డి కోస్తే ఖర్చుతో పాటు పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అందుకే ఫోక్స్‌వ్యాగన్ యంత్రాలకు స్వస్తి చెప్పి, ప్యానెళ్ల కింద ఉన్న గడ్డిని సరిగ్గా నిర్వహించడానికి 100 గొర్రెల మందను రంగంలోకి దించింది.

లాభాలు ఒక్కటి కావు.. మూడంతలు..

ఈ నిర్ణయం వల్ల కంపెనీకి ఎన్నో లాభాలు ఉన్నాయి.

ఖర్చు ఆదా: యంత్రాలతో గడ్డి కోసే ఖర్చు, మెయింటెనెన్స్ చార్జీలు భారీగా తగ్గాయి.

పర్యావరణ పరిరక్షణ: యంత్రాల వాడకం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.

జీవవైవిధ్యం: సహజ సిద్ధమైన పద్ధతిలో గడ్డి నియంత్రణ జరిగి జీవవైవిధ్యం పెరుగుతుంది.

కంపెనీ డైరెక్టర్ ఏమన్నారంటే..?

“ఈ ఫార్మ్ కేవలం గ్రీన్ ఎలక్ట్రిసిటీని ఇవ్వడమే కాదు.. జీవవైవిధ్యం, స్థానిక వ్యవసాయం, శాస్త్రీయ పరిశోధనలను కూడా ప్రోత్సహిస్తోంది. ఆధునిక పరిశ్రమలు ప్రకృతితో సామరస్యంగా ఎలా పనిచేయాలో ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తోంది’’ అని ఫోక్స్‌వ్యాగన్ డైరెక్టర్ మార్జెనా పిలిచ్ గ్రోన్స్కా అన్నారు.

కేవలం గడ్డి కోయడమే కాదు.. అంతకుమించి..

ఈ ప్రయోగాన్ని కేవలం గడ్డి కోయడానికే పరిమితం చేయకుండా ఫోక్స్‌వ్యాగన్ సంస్థ పోజ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలతో చేతులు కలిపింది. సోలార్ ప్యానెళ్ల నీడ గొర్రెలకు ఎండ వేడి నుండి ఉపశమనం కలిగిస్తుందా? ఈ విధానం వల్ల నేల నాణ్యత, స్థానిక సూక్ష్మ వాతావరణం, జీవవైవిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాలపై శాస్త్రవేత్తలు సమగ్ర పరిశోధనలు చేస్తున్నారు.

కొత్త వాతావరణానికి అలవాటుపడిన గొర్రెలు

ఈ గొర్రెల మంద యజమాని జస్టినా నోవాక్ గజెక్ మాట్లాడుతూ.. గొర్రెలు సోలార్ ప్లాంట్ వాతావరణానికి చాలా త్వరగా అలవాటుపడ్డాయని తెలిపారు. ప్యానెళ్ల మధ్య చిన్న చిన్న గుంపులుగా విడిపోయి అవి చాలా ప్రశాంతంగా గడ్డి మేస్తున్నాయని, ఈ వాతావరణంలో అవి సురక్షితంగా భావిస్తున్నాయని తెలిపారు. పారిశ్రామిక రంగానికి, ప్రకృతికి మధ్య సమతుల్యతను కాపాడేలా ఫోక్స్‌వ్యాగన్ చేపట్టిన ఈ ఈకో ఫ్రెండ్లీ ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us