AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానుంది అసలు ముప్పు! భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక

గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ హెచ్చరికల ప్రకారం, భారత్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వ్యవసాయం, గృహాలు, డిజిటల్ రంగాల మధ్య నీటి పంపిణీ సమర్థంగా లేకపోవడం, రాష్ట్రాల పరిధిలో విభిన్న విధానాలు, వాతావరణ మార్పులు దీనికి ప్రధాన కారణాలు.

రానుంది అసలు ముప్పు! భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక
India Water Crisis Moody's
SN Pasha
|

Updated on: Jun 24, 2026 | 12:48 PM

Share

భారత్‌లో నీటి నిర్వహణ వ్యవస్థను తక్షణమే బలోపేతం చేయకపోతే రాబోయే సంవత్సరాల్లో దేశం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ హెచ్చరించింది. వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలు, వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రంగాల మధ్య నీటి పంపిణీ సమర్థవంతంగా జరగకపోవడం ప్రధాన సమస్యగా పేర్కొంది. మూడీస్ విశ్లేషణ ప్రకారం.. భారతదేశంలో నీటి నిర్వహణ బాధ్యతలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండటంతో దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం అమలు కావడం లేదు. ప్రతి రాష్ట్రం వేర్వేరు ప్రాధాన్యతలు, విధానాలను అనుసరించడం వల్ల నీటి వనరుల సమన్వయ వినియోగం కష్టతరమవుతోంది.

భారత్‌లో లభ్యమయ్యే మంచినీటిలో దాదాపు 80 శాతం వ్యవసాయ రంగానికే వినియోగమవుతోంది. రైతులకు నీరు, విద్యుత్‌పై సబ్సిడీలు అందించడం వల్ల ప్రభుత్వాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. అదే సమయంలో నీటిని వ్యవసాయం నుంచి పరిశ్రమలు, పట్టణ అవసరాలకు మళ్లించే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో డిమాండ్ – సరఫరా మధ్య అంతరం పెరుగుతోంది. ఇక దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాలు, కృత్రిమ మేధ (AI) ఆధారిత పరిశ్రమలకు భారీ స్థాయిలో నీటి అవసరం ఉంది. ముఖ్యంగా సర్వర్లను చల్లబరచడానికి పెద్ద మొత్తంలో నీటిని వినియోగించాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఈ రంగం మరింత విస్తరించడంతో నీటి డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మూడీస్ అంచనా వేసింది.

వాతావరణ మార్పులు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. తరచూ సంభవిస్తున్న కరువులు, వరదలు, అస్థిర రుతుపవనాలు, మారుతున్న వర్షపాతం సరళి దేశ నీటి భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు భూగర్భ జలాల అధిక వినియోగం, పాతబడిన పైప్‌లైన్ వ్యవస్థలు సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు ఇప్పటికే నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముంబైలోని జలాశయాల్లో నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోగా, ఢిల్లీలో అనేక ప్రాంతాలు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. చెన్నై ప్రస్తుతం కొంత మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పెరుగుతున్న డిమాండ్ అక్కడ కూడా సవాళ్లను సృష్టించే అవకాశం ఉంది.

పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సమర్థవంతమైన నీటి నిర్వహణ కేవలం పర్యావరణ పరిరక్షణకే కాదు, దేశ ఆర్థిక స్థిరత్వానికి కూడా అత్యంత కీలకమని మూడీస్ స్పష్టం చేసింది. దీర్ఘకాలిక ప్రణాళికలు, పటిష్టమైన నీటి పాలన, వనరుల సమర్థ వినియోగం లేకపోతే భారత్ మరింత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us