దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ పాన్ కార్డు అనేది అవసరం. ఇది లేకపోతే ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించలేరు. బ్యాంక్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి ఐటీ రిటర్న్స్ పొందటం వరకు ప్రతీ పనికి దీని అవసరం ఉంటుంది.
అయితే పాన్ కార్డు సేవలకు సంబంధించి కేంద్రం అనేక మార్పులు చేసింది. పాన్ 2.0ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా అన్ని పాన్, టాన్ సేవలను ఒకే డిజిటల్ పోర్టల్‌లో విలీనం చేస్తుంది.
పాన్ జారీ నుండి అప్‌డేట్‌ల వరకు మొత్తం ప్రక్రియ పూర్తిగా కాగిత రహితంగా మార్చనుంది. కొత్త వ్యవస్థలో పాన్‌లు ఉచితంగా, చాలా వేగంగా జారీ చేస్తారు
కొత్త పాన్ డేటా వాల్ట్, కఠినమైన డేటా రక్షణ చర్యలు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం నుండి కాపాడతాయి. పాన్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉంటుంది.
ఒక ప్రత్యేక హెల్ప్‌డెస్క్, కాల్ సెంటర్ వినియోగదారుల సందేహాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. పాన్ వ్యవస్థను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయడంలో ఇది సహాయపడుతుంది
పలు ప్రభుత్వ సేవల్లో పాన్‌ను ఉమ్మడి గుర్తింపు కార్డుగా ఉపయోగించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ కొత్త వ్యవస్థను దశలవారీగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
పాన్ 2.0 అనేది ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్‌గా చెప్పవచ్చు. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పన్ను చెల్లింపుదారుల డిజిటల్ అనుభవాన్ని మెరుగుపర్చాలనే లక్ష్యంతో దీనిని ప్రవేశపెట్టింది.
పాన్ సంబంధిత సేవలన్నీ ఆదాయపు పన్ను శాఖ ఒకే ఏకీకృత పోర్టల్ ద్వారా అందించనుంది. కొత్త పాన్లకు క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు. ఇక పాన్ సవరణ, అప్‌డేట్‌లు ఉచితంగా చేయబడతాయి.