HMDA E-Auction: హైదరాబాద్‌లో రియల్ భూమ్.. ఆ ప్రాంతంలో రూ.80వేలు పిలికిన గజం భూమి ధర!
హైదరాబాద్‌లో భూముల రేట్ల కళ్లేంలేని గుర్రంలా దూసుకుపోతున్నాయి. తాజాగా మేడిపల్లి రెసిడెన్షియల్ లేఅవుట్‌లో HMDA నిర్వహించిన మూడో విడత ఈ-వేలం ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. అక్కడ ఒక్క గజం భూమి ఏకంగా రూ.80వేలకు అమ్ముడుపోయింది. ఈ వేలంలో మొత్తం 63 ప్లాట్ల విక్రయించిన HMDA రూ.120 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. తూర్పు హైదరాబాద్‌లో నివాస స్థలాలకు ఉన్న అధిక డిమాండ్‌ను ఇది స్పష్టం చేసింది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) చేపట్టిన మెడిపల్లి రెసిడెన్షియల్ లేఅవుట్ మూడో విడత ఈ-వేలానికి విశేష స్పందన లభించింది. బుధవారం నిర్వహించిన ఈ-వేలంలో అమ్మకానికి ఉంచిన 68 ప్లాట్లలో 63 ప్లాట్లు విక్రయమయ్యాయి. దీంతో హెచ్‌ఎండీఏకు సుమారు రూ.120 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో నివాస స్థలాలపై ఉన్న డిమాండ్‌కు ఈ వేలం మరోసారి నిదర్శనంగా నిలిచింది.
వేలంలో చదరపు గజానికి గరిష్ఠంగా రూ.80 వేల వరకు ధర పలికింది. సగటున చదరపు గజం రూ.56,260కు విక్రయమైంది. పలు ప్లాట్లకు ఒకటి కంటే ఎక్కువ మంది పోటీగా బిడ్లు వేయడంతో ధరలు బాగా పెరిగాయి. ముఖ్యంగా నివాస గృహం నిర్మించాలనుకునే వారు, భవిష్యత్ పెట్టుబడిగా భూమి కొనుగోలు చేయాలనుకునే వారు ఈ వేలంలో ఆసక్తిగా పాల్గొన్నారు.
మెడిపల్లి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస కేంద్రంగా మారుతుండటం, రహదారి అనుసంధానం, నగరానికి సులభ రాకపోకలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు కొనుగోలుదారులను ఆకర్షించినట్లు అధికారులు తెలిపారు. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లపై ప్రజలకు ఉన్న నమ్మకం ఈ వేలం ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు.
ఈ-వేలం పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర నగరాల్లో ఉన్న కొనుగోలుదారులు కూడా సులభంగా బిడ్లు దాఖలు చేసే అవకాశం లభించింది. పోటీ ఎక్కువగా ఉండటంతో పలు ప్లాట్ల ధరలు అంచనాలను మించాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ విజయవంతమైన వేలంతో మెడిపల్లి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశముందని హెచ్‌ఎండీఏ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి, కొత్త పెట్టుబడులు, నివాస ప్రాజెక్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏ చేపడుతున్న ప్రణాళికాబద్ధమైన లేఅవుట్లకు మార్కెట్లో మంచి ఆదరణ కొనసాగుతున్నట్లు ఈ వేలం ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
