School Holidays 2026: బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్!
June 26 School Holiday: ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇవ్వడంతో సెలవుపై క్లారిటీ వచ్చింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మరో రోజు విశ్రాంతి లభించనుంది..

హైదరాబాద్, జూన్ 25: సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరచుకుంటున్నాయి. అకడమిక్ సెషన్ కొద్దికొద్దిగా పుంజుకుంటుంది. విద్యార్ధుల తల్లిదండ్రులు కొత్త పుస్తకాలు, యూనీఫాం, బ్యాగుల కొనుగోళ్లలో మునిగిపోయారు. ఈ క్రమంలో బడి పిల్లలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు రానుంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు జారీ చేశాయి. మొహర్రం పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం (జూన్ 26) మూసివేయనున్నారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడటంతో ఈ మేరకు సెలవు దినంపై క్లారిటీ వచ్చింది.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 1448 హిజ్రీ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. చంద్రుని దర్శనాన్ని అనుసరించి గల్ఫ్ దేశాలకు, భారత్‌కి మధ్య ఈసారి ఒక రోజు తేడా వచ్చింది. గల్ఫ్ దేశాలలో జూన్ 16న మొహర్రం ప్రారంభమవగా.. భారత్‌లో మాత్రం జూన్ 17న నెలవంక కనిపించింది. దీంతో అత్యంత పవిత్రమైన ‘ఆషూరా’ దినాన్ని భారత్‌లో ఎప్పుడు నిర్వహిస్తారనే సందిగ్ధతపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. స్థానిక చంద్ర దర్శనం ఆధారంగా ఈ ఏడాది సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలలో జూన్ 25 (గురువారం) ఆషూరా పండగను జరుపుకుంటున్నారు. భారత్‌లో చంద్రుడు ఒక రోజు ఆలస్యంగా కనిపించిన కారణంగా జూన్ 26న అంటే శుక్రవారం నాడు ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ తేడా కారణంగానే సెలవు తేదీలలో మార్పు వచ్చింది.
ఇక జూన్ 26 (శుక్రవారం)న మొహర్రం సందర్భంగా పబ్లిక్ హాలిడేగా సర్కార్ గెజిటెడ్ ప్రకటించింది. దీంతో రేపు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడనున్నాయి. శుక్రవారం సెలవు కావడంతో ఆ తర్వాత వచ్చే శని, ఆదివారాలతో కలిపి మొత్తంగా 3 రోజుల పాటు ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా సెలవులు రానున్నాయి. వేసవి సెలవుల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు తరగతులను పునఃప్రారంభించిన కొద్ది రోజులకే ఈ సెలవు వచ్చింది. 10వ మొహర్రం ఆషూరాను జరుపుకోనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొహర్రం సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా సవరించి సాధారణ సెలవును జూన్ 25 నుంచి జూన్ 26కు మార్చింది. అలాగే 9వ మొహర్రం సందర్భంగా జూన్ 25వ తేదీని ఐచ్ఛిక సెలవుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మొహర్రం పండుగ ఎందుకు జరుపుకుంటారు?
మొహర్రం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. సున్నీ ముస్లింలు ఈ రోజున ప్రవక్త మూసాను ఈజిప్ట్ రాజు ఫారో నుండి దేవుడు రక్షించినందుకు గుర్తుగా ‘ఆషూరా’ నాడు ఉపవాశం ఉంటారు. అయితే షియా ముస్లింలు మాత్రం దీనిని శోకదినంగా పాటిస్తారు. దేశంలోని అనేక ప్రాంతాలలో దీనిని జరుపుకుంటారు. ఈ పండుగ తేదీని చంద్ర క్యాలెండర్ ఆధారంగా నిర్ణయిస్తారు. దీనివల్ల చంద్రుని దర్శనాన్ని బట్టి అధికారిక షెడ్యూల్‌లో మార్పులు జరగవచ్చు. జూన్ 26న భౌతిక శాఖలు, కార్యాలయాలు మూసి ఉన్నప్పటికీ నిత్యావసర సేవలు, పలు ప్రైవేట్ సంస్థలు తమ అంతర్గత సెలవు విధానాల ఆధారంగా పనిచేస్తాయి. ఈ సెలవుకు సంబంధించిన ఏవైనా స్థానిక షెడ్యూల్ మార్పులు, ప్రత్యేక సూచనల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పాఠశాలలను సంప్రదించవచ్చు..




