Credit Card: ఉచిత సినిమా టికెట్లు కట్.. ఛార్జీలు మరింత పెంపు.. ఈ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే నవంబర్ 25వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. క్రెడిట్ కార్డులపై పలు బెనిఫిట్స్ తొలగించింది. ఉచిత సినిమా టికెట్లను నిలిపివేయడంతో పాటు ఛార్జీలను పెంచింది. కొన్ని నిబంధనలు ఈ నెలలో అమల్లోకి రానుండగా.. మరికొన్ని డిసెంబర్ 15 నుంచి అమలు చేయనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. పలు ఉచిత ప్రయోజనాల్లో కోత విధించింది. ఈ మేరకు పలు నిబంధనల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డులు ఉపయోగించే కస్టమర్లపై ఇవి తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అనేక ప్రముఖ క్రెడిట్ కార్డులపై ఉచిత బెనిఫిట్స్‌ను తొలగించింది. ఉచిత సినిమా టికెట్లను తీసివేయడంతో పాటు వ్యక్తిగత, విమాన ప్రమాద బీమా తొలగించింది. అలాగే అంతర్జాతీయ లావాదేవీలపై ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఉచిత సినిమా టికెట్లు బంద్..
ఇప్పటివరకు కొన్ని రకాల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై ఉచిత సినిమా టికెట్లను పొందే అవకాశం ఉండేది. అలాగే ఒక టికెట్ కొంటే మరో కొంటే ఫ్రీగా వచ్చేది. కానీ ఇక నుంచి అలాంటి సౌకర్యం ఉండదు. ఈ మేరకు రూబీఎక్స్, కోరల్, ఎక్స్‌ప్రెషన్స్, చెన్నై సూపర్ కింగ్స్, మేక్‌మైట్రిప్, హెచ్‌పిసిఎల్ వంటి కార్డులపై ఉచిత ఐనాక్స్ సినిమా టికెట్లను జారీ చేయడాన్ని నిలిపివేయనుంది. ఇక ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్, డైమండ్, సఫైరో, రూబీX వంటి క్రెడిట్ కార్డ్‌లపై విమాన ప్రమాద బీమాను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. Parakram Select, Parakram క్రెడిట్ కార్డ్‌లపై వ్యక్తిగత, విమాన ప్రమాద బీమా సౌకర్యం తొలగించనుంది.
నవంబర్ 25 నుంచే ఛార్జీల పెంపు..
అటు ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్, ఎమరాల్డ్ ప్రైవేట్ కార్డులపై ప్రయాణ రద్దు కోసం ఉన్న ‘ఏ కారణం చేతనైనా రద్దు’ అనే కవరేజీని తొలగించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. అలాగే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలను కూడా పెంచింది. డీసీసీ రసుంలను 1 శాతం నుంచి 3.50 శాతానికి పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ చార్జీల పెంపు నవంబర్ 25 నుంచే అమల్లోకి రానుంది. విదేశాల్లో భారత కరెన్సీలో చేసే లావాదేవీలకు, దేశంలో ఉండి విదేశాల్లో నమోదైన వ్యాపారికి చేసే లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు వాడేవారందూ ఈ లావాదేవీల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే లావాదేవీలు చేసే సమయంలో ఇబ్బందులు పడే అవకాశముంది. ఇప్పటికే ఐసీఐసీఐ ఈ ఏడాది నుంచి పలు క్రెడిట్ కార్డులకు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులో ఉచిత లాంజ్ సౌకర్యాన్ని నిలిపివేసింది. అలాగే పలు క్రెడిట్ కార్డులకు ఉచిత సినిమా టికెట్ల రాయితీని కట్ చేయగా.. ఇప్పుడు మరికొన్ని కార్డులకు కూడా తొలగించింది.
