Telangana: తెలంగాణలో కొత్త పింఛన్ల జారీపై బిగ్ అప్డేట్.. అప్పటి నుంచే పంపిణీ..
తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన చేసింది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు అందించింది. వచ్చే నెల నుంచి కొత్త పించన్ల జారీ కోసం దరఖాస్తులను ఆహ్వానించనుంది. అటు అనర్హులను గుర్తించే సర్వే ఈ నెలాఖరుతో ముగియనుంది.

తెలంగాణలో చేయూత పింఛన్ల పథకంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్ల పంపిణీపై కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించింది. అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హులైనవారికి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అర్హులైన ప్రతీఒక్కరికీ పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. గ్రామాలు, పట్టణాల్లో సెర్ప్ అధికారులు సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో తమకు అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని వృద్దులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు పింఛన్లు అందించాలని వినతి పత్రాలు అందిస్తున్నారు.
వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు
ఈ క్రమంలో అర్హులైనవారికి కొత్త పింఛన్లను మంజూరు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అయితే అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతోంది. ఈ సర్వే తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖారుతో సర్వే ముగియనుండగా.. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. కొంతమంది అర్హత లేకపోయినా పింఛన్ పొందుతున్నారు. అలాగే మరణించినవారు, వలస వెళ్లిపోయినవారు, వేరే ప్రాంతాల్లో స్థిరపడినవారు కూడా ఉన్నారు. దీని వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, లబ్దిదారుల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో నిజమైన లబ్దిదారులకు మాత్రమే పింఛన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థను రంగంలోకి దింపింది. ఈ సంస్థ లైవ్ అథెంటికేషన్ సర్వే చేపడుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అనర్హులను గుర్తిస్తోంది.
ఈ నెలాఖరుకు సర్వే పూర్తి
రాష్ట్రంలో మొత్తం 42 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో బ్యాంక్ అకౌంట్లలో నేరుగా పింఛన్లు పొందుతున్నవారు 19,04,239 మంది ఉన్నారు. వీరిలో 93,624 మందిని అనర్హులుగా గుర్తించింది. 40,751 మంది మరణించగా.. వీరి పేరిట ఇంకా నిధులు విత్ డ్రా అవుతున్నట్లు తేలింది. 41,689 మంది ఆచూకీ లభించడం లేదు. 3,495 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. 11 వేల మంది ఆధార్లు చెల్లకపోగా.. వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ప్రస్తుతం 15.97 లక్షల మంది సర్వే పూర్తి చేశారు. ఈ నెలాఖరు నాటికి 100 శాతం సర్వే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లలో పారదర్శకత తెచ్చేందుకు ఈ మెగా సర్వే చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాగా పించన్లను బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పోస్టాఫీసుల ద్వారా పింఛన్లను అందించేవారు. అయితే ఇక నుంచి నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
